ఫోన్ పక్కన పెడితే బలపడుతున్న కుటుంబ బంధాలు
మధురానుభూతులు పంచుతున్నతల్లిదండ్రులు, పిల్లల ముచ్చట్లు
వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడి
భోజన సమయంలోనైనా ‘స్విచ్ ఆఫ్’ పాటించాలనే సూచనలు
సెల్‌ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్‌ఫోన్‌ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.
చిన్న పనే..పెద్ద ప్రభావం
ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్‌లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.
శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.
ఏం చేయాలి..?
భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.
ఏది ఏమైనా గ్యాడెŠజ్‌ట్స్‌ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్‌ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.
ఎవరెవరు పాల్గొన్నారంటే..
స్మార్ట్‌ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్‌తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.
స్టడీ హైలైట్స్
⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.
⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.
⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.
⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.
⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.
అంకెల్లో యూజర్లు..
ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు.
మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు.


