ముంబై/న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు తో తలెత్తిన సంక్షోభంపై సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ విచారణ కొనసాగుతోంది. డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజూ పీటర్ ఎల్బర్స్‌ను దాదాపు ఏడుగంటలపాటు ప్రశ్నించారు. ఇండిగో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను కూడా ఐదుగంటలపాటు విచారణ జరిపారు.
అదేవిధంగా, విమానాల రాకపో కలను పర్యవేక్షించడంలో లోపాలను గుర్తించిన డీజీసీఏ అధికారులు అందుకు బాధ్యులైన నలుగురు ఫ్లయిట్ ఆప రేషన్స్ ఇన్‌స్పెక్టర్లను తొలగించారు. ప్రయా ణికులకు పరిహారంగా రూ.10వేల చొప్పున ట్రావెల్ వోచర్లు ఇస్తే, సంస్థపై రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని ఇండిగో శుక్రవా రం తెలిపింది. అంతేకాదు, విమాన రాకపో కల్లో మూల కారణాన్ని తెలుసుకునేందుకు వైమానిక రంగ నిపుణుడిని నియమిస్తున్నట్లు తెలిపింది. రివైజ్డు తగ్గింపు షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 2 వేలకు పైగా విమానాలను నడిపినట్లు తెలిపింది.


