విమానయన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి సంబంధించి నలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. గడిచిన పది రోజుల్లో ఇండిగో భారీగా విమానాలు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి అంతటికీ బాధ్యులను చేస్తూ నలుగురు ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్లను (ఎఫ్ఐఓ) ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ శుక్రవారం సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన ఈ నలుగురు అధికారులు విమానయాన భద్రత, పైలట్ శిక్షణ, నిర్వహణకు సంబంధించిన బాధ్యతలు చూస్తారు. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు ఏవియేషన్ రెగ్యులేటర్ ముందు హాజరవుతున్న తరుణంలోనే అధికారుల సస్పెన్షన్ జరగడం గమనార్హం.
విమానాల అనూహ్య రద్దుతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వేల సంఖ్యలో ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే శుక్రవారం రోజున అత్యధికంగా 1,600కి పైగా విమానాలు రద్దు కావడం అత్యవసర ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది.


