దేశంలో మెజారిటీ నిపుణులు తమ కోసం తాము కష్టపడాలన్న అభిలాషతో ఉన్నారు. కృత్రిమ మేథ (ఏఐ), కొత్త నైపుణ్యాల పట్ల ఆసక్తి, ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ల మద్దతుతో వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని విస్తరించుకోవడం సులభమన్న అభిప్రాయం లింక్డ్‌ఇన్ సర్వేలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి లింక్డ్‌ఇన్ ఒక నివేదికను విడుదల చేసింది. నిపుణుల లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్‌లో ‘ఫౌండర్’ (వ్యవస్థాపకుడు) అని జోడించినవి గత ఏడాది కాలంలో 104 శాతం పెరిగాయి. ప్రతి పది మందిలో ఏడుగురు నిపుణులు తమకోసం కష్టపడాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకు పలు అంశాలు అనుకూలిస్తున్నట్టు లింక్డ్‌ఇన్ నివేదిక తెలిపింది.
చిన్న సంస్థల వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ ఒక భాగంగా మారిపోయింది.
వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించడం సులభమని 82 శాతం మంది చిన్న, మధ్య స్థాయి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపార వృద్ధికి ఏఐని కీలకంగా 83 శాతం మంది పరిగణిస్తున్నారు. 11–200 మధ్య ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఏఐపై అవగాహన 52 శాతం పెరిగింది.
81 శాతం చిన్న, మధ్యస్థ వ్యాపార సంస్థలు ఏఐ సామర్థ్యాలపై పెట్టుబడులు పెడుతున్నాయి.
భారత్ స్థానం ప్రత్యేకం..
‘‘భారత్‌లో చిన్న వ్యాపార సంస్థలు అసాధారణ వేగం, ఆకాంక్షలతో ముందుకు సాగుతున్నాయి. ఏఐని వేగంగా స్వీకరించడం, నైపుణ్యాలను పెంచుకోవాలన్న అభిలాష, విశ్వసనీయమైన నిపుణుల నెట్‌వర్క్‌ల కలయిక భారత్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇవన్నీ కలసి వ్యాపారాన్ని ప్రారంభించడం, విస్తరించడం, విజయవంతం చేయడాన్ని పునర్‌నిర్మిస్తున్నాయి’’ అని లింక్డ్‌ఇన్ భారత్ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామ్ తెలిపారు.
ఇదీ చదవండి: నైట్‌క్లబ్‌లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు


