చిట్ట చివరన ఏపీ పోలీస్‌.. చట్టం.. చతికిల! | Central Government Report On Police System In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చిట్ట చివరన ఏపీ పోలీస్‌.. చట్టం.. చతికిల!

Nov 21 2025 3:48 AM | Updated on Nov 21 2025 3:48 AM

Central Government Report On Police System In Andhra Pradesh

రెడ్‌బుక్‌ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన పోలీసు వ్యవస్థ 

దేశంలోనే అట్టడుగున ఆంధ్రా పోలీస్‌

బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాల అమలులో పూర్తి వైఫల్యం 

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదిక

36వ స్థానంతో జాబితాలో చిట్టచివర స్థానంలో ఏపీ పోలీసు శాఖ 

100 పాయింట్లకు దక్కింది కేవలం 16.70 పాయింట్లే..

పనితీరులో కనీసం పాస్‌ మార్కులు కూడా దక్కని వైనం 

రాజకీయ కక్ష సాధింపులతో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం 

తాజాగా మావోయిస్టుల ఏరివేత ఆద్యంతం కేంద్రం కనుసన్నల్లోనే..  

సాక్షి, అమరావతి: రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. అధికార దుర్వినియోగం.. రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి చంద్రబాబు సర్కారు రాజకీయ పాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలైంది! కుప్ప కూలినట్లు వెల్లడైంది. పనితీరులో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఫలితం ఇదీ!

దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరుపై కేంద్ర హోంశాఖ రూపొందించిన 2025 నివేదికలో ఏపీ పోలీసు శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. పోలీసు సంస్కరణల్లో భాగంగా ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారతీయ నాగరిక సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) చట్టాల అమలుపై కేంద్ర హోంశాఖ తాజా నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు శాఖల పనితీరును మదించి ఈ ర్యాంకులు ప్రకటించింది.

ఏపీ పోలీసు శాఖ 100 పాయింట్లకు గానూ కేవలం 16 పాయింట్లే తెచ్చుకుని 36 స్థానానికి పడిపోవడం గమనార్హం. అయితే మావోయిస్టులను కట్టడి చేశామని, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దాదాపు 50 మందిని పట్టుకున్నామని ఏపీ పోలీసు ఉన్నతాధికారులు గొప్పలు చెప్పుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో, కేంద్ర బలగాల ద్వారా జరిగిందని.. ఏపీ పోలీసుల ద్వారా అరెస్టును మాత్రమే చూపించారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

                 బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాల అమలులో దేశంలోనే అట్టడుగున ఏపీ పోలీసు శాఖ ఉందని పేర్కొన్న కేంద్ర హోం శాఖ నివేదిక   

16.70 శాతం పాయింట్లతో చిట్టచివరన 
100 మార్కుల పరీక్షలో కనీసం 35 మార్కులు తెచ్చుకుంటే పాస్‌ అయినట్లు లెక్క! మరి బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాల అమలులో ఏపీ పోలీసు శాఖ వంద పాయింట్లకు ఎన్ని సాధించిందో తెలుసా..? కేవలం 16.70 పాయింట్లకే పరిమితమైంది. అంటే కనీసం పాస్‌ మార్కులు కూడా తెచ్చుకోలేక చతికిలపడింది. కేంద్ర హోంశాఖ నిర్వహించిన పరీక్షలో ఫెయిల్‌ అయ్యింది. జాబితాలో చిట్ట చివరన అంటే 36వ స్థానంలో నిలిచింది. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కలిపి దేశంలో పోలీసు శాఖ సగటు పాయింట్లు  36. అంటే దేశ సగటును కూడా ఏపీ పోలీసు శాఖ చేరుకోలేకపోయింది.

నాలుగు విభాగాలుగా పనితీరు మదింపు 
పౌరులకు సత్వరం, సక్రమంగా పోలీసు సేవలను అందించడం.. బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో సంస్కరణలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి అమలులో ఉన్న కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ), ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ) చట్టాల స్థానంలో బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాలను ప్రవేశపెట్టింది. పోలీసు సంస్కరణల్లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. కేసుల నమోదు, దర్యాప్తు, విచారణలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకాలను రూపొందించింది.

తద్వారా పోలీసులు నిబంధనలను ఉల్లంఘించకుండా పౌరులకు సత్వరం సక్రమంగా సేవలు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలో బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాలను వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్ర హోంశాఖ విశ్లేషించింది. ప్రధానంగా నాలుగు విభాగాలుగా పోలీసు శాఖల పనితీరును మదించింది. పరిపాలన సంస్కరణలకు 20 శాతం, నిర్వహణపరమైన సమర్థతకు 45 శాతం, సమాచార–సాంకేతికత అమలు (ఐసీటీ అప్లికేషన్స్‌)కు 25 శాతం,  పోలీసు – వైద్య – ఆరోగ్య – న్యాయ శాఖల మధ్య సమన్వయానికి 10 శాతం చొప్పున పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు పోలీసు శాఖల పనితీరును మదించింది. 

దేశంలో మొదటి స్థానంలో అసోం
బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాల అమలులో దేశంలో అసోం మొదటి స్థానం సాధించింది. మొత్తం వంద పాయింట్లకు అసోం పోలీసు శాఖ ఏకంగా 72.03 శాతం పాయింట్లు సాధించడం విశేషం. హర్యానా 62.70 పాయింట్లతో రెండో స్థానంలో, సిక్కిం 60.87 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. ఉగ్రవాద కార్యకలాపాలతో అట్టుడుకుతున్నప్పటికీ  జమ్మూ–కశ్మీర్‌ 59.20 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు బిహార్‌ కూడా 47.92 పాయింట్లు సాధించి 15వ స్థానం దక్కించుకుంది.

అక్రమ చొరబాట్లతో అతలాకుతలమవుతున్నప్పటికీ మణిపూర్‌ 45.74 పాయింట్లతో 21 స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ మాత్రం 16.70 పాయింట్లకు పరిమితమై దేశంలోనే అట్టడుగున 36 స్థానానికి పడిపోయింది. చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ రాజ్యాంగం పోలీసు వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందన్నది ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. బాబు సర్కారు రాజకీయ కుట్రలకు డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్, ఇతర టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులు కొమ్ముకాస్తుండటంతో ఏపీ పోలీసు శాఖ పరువు బజారున పడిందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

నాలుగు విభాగాల్లోనూ విఫలం..
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు విభాగాల్లోనూ రాష్ట్ర పోలీసులు  అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు. అందులో ఏపీ పోలీసుల దారుణ పనితీరు ఇలా ఉంది..!

పాలన సంస్కరణలకు కూటమి మోకాలడ్డు
పరిపాలన సంస్కరణల విభాగంలో 20 పాయింట్లకుగానూ ఏపీ పోలీసు శాఖకు కేవలం 8.77 పాయింట్లే లభించాయి. కేసుల దర్యాప్తులో అధికారులు సక్రమంగా వ్యవహరించేందుకు తెచి్చన సంస్కరణలను ఇందులో నిర్దేశించారు. ఉదాహరణకు గతంలో ఏదైనా నేరం జరిగితే దర్యాప్తు అధికారి ఘటనా స్థలానికి చేరుకుని స్కెచ్‌ వేయించి ఫొటో తీసి కేస్‌ డైరీ (సీడీ) ఫైల్‌లో నమోదు చేసేవారు. అయితే ఈ ప్రక్రియలో లొసుగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. దీంతో ఘటనా స్థలంలో కేవలం ఫోటో కాకుండా స్కెచ్‌ వేస్తున్నప్పుడు వీడియో తీయాలని, ఆ వెంటనే నేరుగా సీడీ ఫైల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.

తద్వారా స్కెచ్‌ వేస్తున్న సమయం, సీడీ ఫైల్‌లో అప్‌లోడ్‌ చేసిన సమయం రికార్డు అవుతాయి. అందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, ఇతరులకు ట్యాబ్‌లు ఇవ్వడంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్నే పట్టించుకోలేదు. పోలీస్‌ స్టేషన్‌కు కేవలం ఒక ట్యాబ్‌ను మాత్రమే అందించింది. పట్టణ ప్రాంతాల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రోజుకు సగటున నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ఒక్క ట్యాబ్‌ మాత్రమే ఉంది.

దాంతో తీవ్రత తక్కువ ఉన్న కేసుల దర్యాప్తునకు ట్యాబ్‌ తీసుకెళుతున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడిన నేరాల దర్యాప్తునకు ట్యాబ్‌లు తీసుకువెళ్లడం లేదు. అధికార టీడీపీ కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యాచార ఘటనలను తొక్కిపెడుతుండటంతో పోలీసు వ్యవస్థ పనితీరు దారుణంగా దిగజారింది. ఫలితంగా పాలన సంస్కరణల విభా­గంలో 20 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖ 8.77 పాయింట్లే తెచ్చుకుంది.  

కుప్పకూలిన నిర్వహణ సామర్థ్యం
కీలకమైన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తులో ఏపీ పోలీసు శాఖ పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది. ఈ విభాగంలో మొత్తం 45 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే రావడం అందుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సది్వనియోగం చేసుకునేందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఫోరెన్సిక్‌ పరిజ్ఞానం, సైబర్‌ టెక్నాలజీ, ఆధునిక దర్యాప్తు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాలి.

కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆధునిక దర్యాప్తు ప్రక్రియలపై కనీస శిక్షణ కూడా అందించలేదు. ‘అప్పా’ ఏర్పాటును విస్మరించింది. టీడీపీ కూటమి నేతలు బరితెగించి పాల్పడుతున్న కేసుల దర్యాప్తును నీరుగార్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హత్యలు, లైంగిక దాడులు, సోషల్‌ మీడియాలో వేధింపులు, ఫోరెన్సిక్, సైబర్‌ నేరాలకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు నీరుగారుతున్నాయి. పోలీసులకు శిక్షణ గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దానివల్లే ఈ విభాగంలో ఏపీ పోలీసు శాఖకు కేవలం 7.93 పాయింట్లే వచ్చాయి.

సమాచార, సాంకేతికతలో గుండు సున్నా 
చంద్రబాబు ప్రభుత్వం పోలీసు శాఖను ఏ స్థాయికి దిగజార్చిందో కేంద్ర హోంశాఖ నివేదికలోని ‘సమాచార సాంకేతిక అమలు (ఐసీటీ అప్లికేషన్స్‌) విభాగం బట్టబయలు చేసింది. ఈ విభాగంలో 25 పాయింట్లకుగానూ ఏపీ పోలీసులకు వచి్చంది గుండు సున్నా. ఈ విభాగం కింద రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, డేటా కమ్యూనికేషన్ల వ్యవస్థ, వెబ్‌సైట్ల సక్రమ నిర్వహణ తదితర అంశాలను కేంద్రం నిర్దేశించింది. ఒక నిందితుడిని  పోలీస్‌ స్టేషన్‌కు ఎప్పుడు తెచ్చారు?.. లాకప్‌ పరిస్థితులు.. వైద్య  పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి ఎప్పుడు తరలించారు?.. న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు..? లాంటి ప్రక్రియలన్నీ సక్రమంగా పాటించేందుకు విధి విధానాలను నిర్దేశించింది.

అందుకే సీసీ కెమెరాల ఏర్పాటును ప్రధానంగా ప్రస్తావించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని చెవికెక్కించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా సరే.. 9 నెలలుగా పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కారణం.. రెడ్‌బుక్‌ వేధింపులతో వైఎస్సార్‌సీసీ నేతలు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేస్తుండటమే! కనీసం వారిని అరెస్టు చేసిన విషయం కూడా చెప్పకుండా వివిధ పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతికంగా, మానసికంగా హింసిస్తోంది.

టీడీపీ కూటమి సర్కారు పాలనలో రాజమహేంద్రవరంలో ఓ దళితుడిని అర్ధనగ్నంగా లాకప్‌లో హింసించిన విషయం తెలిసిందే. ఇక వందలాది మంది సోషల్‌ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అదుపులోకి తీసుకుని వేధించింది. రెడ్‌బుక్‌ దౌర్జన్యాలు, వేధింపులు బయటపడకూడదనే పోలీస్‌ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదు. ఇక సాంకేతిక మౌలిక సదుపాయల పేరుతో నిధులు పక్కదారి పట్టించారు. కన్సల్టెన్సీ పేరుతో అస్మదీయ కంపెనీకి రూ.10 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను పట్టించుకోలేదు. అందుకే కేంద్ర హోంశాఖ ఐసీటీ విభాగంలోనూ ఏపీ పోలీసులకు సున్నా మార్కులు ఇచ్చింది.

సమన్వయం శూన్యం
కేసుల సమగ్ర దర్యాప్తు, పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు పోలీసు, ఫోరెన్సిక్, వైద్య –ఆరోగ్య, కోర్టులు, జైళ్ల శాఖలను సమన్వయపరుస్తూ ఒక గొడుగు కిందకు తేవాలి. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సమన్వయం విభాగంలో మొత్తం 10 పాయింట్లకు ఏపీ పోలీసు శాఖకు దక్కిన పాయింట్లు సున్నా. ఒక్క పాయింట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ విభాగం కింద ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన తరువాత అన్ని విభాగాలను సమన్వయం చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ కాపీ, కేసు దర్యాప్తు వివరాలు, ఫోరెన్సిక్, వైద్యుల నివేదిక, విచారణ ప్రక్రియ, తీర్పు, నేరస్తుడిని జైలుకు తరలించడం, ఇతర వివరాలన్నీ కంప్యూటర్‌లో ఒక్క క్లిక్‌లో అందుబాటులో ఉండాలి.

అందుకోసం ప్రతి కేసుకు ప్రత్యేకంగా నంబరు కేటాయించాలి. పోలీస్‌ స్టేషన్, ఫోరెన్సిక్‌ విభాగం, ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు, జైళ్ల శాఖలకు తక్షణం అందుబాటులో ఉంచాలి. తద్వారా అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఈ విభాగం గురించి చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి నేతల అరాచకాలు, అక్రమాల కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించడమే లక్ష్యంగా సమన్వయం లేకుండా చేస్తోంది. అన్ని విభాగాలను ఒకే ఛత్రం కిందకు తేవడం లేదు. అందుకే ఈ  విభాగం పనితీరులో కేంద్ర హోంశాఖ ఏపీ పోలీసు శాఖకు సున్నా మార్కులు కేటాయించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement