సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కృషితోనే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ జగన్ ఆలోచన, కష్టంతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రామ్మోహన్ నాయుడు తీరుతో భారత్ పరువు పోయిందని విమర్శించారు.
మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భోగాపురంలో ఎయిర్‌పోర్టులో ట్రయిల్ రన్ జరిగింది. విమానం రన్ వే మీద ఆగడం రామ్మోహన్ నాయుడు బిల్డప్ ఇచ్చాడు. హైదరాబాద్, భోగాపురంలో చంద్రబాబే ఎయిర్‌పోర్టులు కట్టారంటూ రామ్మోహన్ మాట్లాడుతున్నాడు. ఇండిగో అంశాల్లో భారతదేశం సిగ్గు పడుతుంది. ప్రపంచం ముందు భారత్ తలదించుకుంది. అది ఎవరి వల్లనో అందరూ గుర్తు పెట్టుకుంటారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబుకి అసలు సంబంధం ఏంటి?. 2019 ఎన్నికల ముందు దిగిపోతూ శిలాఫలకం పెట్టాడు. ముందు 5 వేల ఎకరాలు అని.. తర్వాత 15వేల ఎకరాలు అని చంద్రబాబు అన్నాడు. ఒక్క ఎకరం కూడా భూమి తీసుకోకుండా శిలాఫలకం వేసి చంద్రబాబు దిగిపోయాడు. బందర్ పోర్టుకి 33వేల ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చి 2019 మార్చి 7వ తేదీ శంకుస్థాపన చేసారు. జగన్ రాకపోతే భోగాపురం ఎప్పటికీ మొదలయ్యేది కాదు. 2200 ఎకరాలు ఎయిర్‌పోర్టుకి చాలు అని.. భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇచ్చి.. కాలనీ నిర్మించి 2023లో శంకుస్థాపన చేశారు..
జగన్ కష్టార్జితమే భోగాపురం..
అన్ని అనుమతులతో భోగాపురం ఎయిర్‌పోర్టు రైతుల త్యాగాలతో నిర్మాణం అవుతుందని.. 2026లో ప్రారంభం అవుతుందని వైఎస్ జగన్ చెప్పారు. వైజాగ్ పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్‌పోర్టుకి 6600 కోట్లతో ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేస్తున్నట్లు మంత్రి గడ్కరీ ప్రకటించారు. 18 నెలల్లో భూ సేకరణ చేసి ఎయిర్‌పోర్ట్ కట్టగలరా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎవరో చేసిన పని తన అకౌంట్‌లో వేసుకోవడం కూటమి నేతలు నేర్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు పారిపోతే భోగాపురం ఎయిర్‌పోర్టు ఎలా కట్టారు?. మీరు ఫొటోలు దిగే ఎయిర్‌పోర్టు జగన్ కష్టార్జితం.
జగన్ మళ్ళీ రాడని, భూస్థాపితం చేశామని కూటమి నేతలు చెపుతున్నారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు టెండర్లు వేయడానికి ముందుకు రావడం లేదు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అసమర్థ పాలన అని చెప్పుకునే మీకు అధికారంలో ఉండే అర్హత ఎక్కడ ఉంది?. చంద్రబాబు చెప్పిన సొల్లు మాటలు ఇవే. కరెంట్ ఛార్జీలు పెంచమని, ప్రతి ఇంటి నుండి కరెంట్ అమ్ముకోవచ్చని చంద్రబాబు చెప్పాడు. మీటర్లు బద్దలు కొట్టమని చెప్పారు. ఇప్పుడు అదే మీటర్లు బిగిస్తున్నారు. వాలంటీర్లకి 10వేలు ఇస్తామని చెప్పారు.. వాలంటీర్లు లేకుండా చేశారు..

మెడికల్ కాలేజీలు తీసుకోవాలని అనుకొనే వాళ్లను చట్టం ప్రకారం చర్యలు తీసుకొంటామని జగన్ చెప్పాడు. ఎకరం భూమి రూపాయికి, ఆసుపత్రి ఫ్రీ.. రెండేళ్లు డాక్టర్లు జీతాలు ఇస్తామని ప్రకటించిన ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టెండర్లు ఒక్కడు కూడా వేయలేదు. కానీ ఆదోనికి ఒక టెండర్ వచ్చిందని సంకలు గుద్దుకున్నారు. రెండు రోజుల్లోనే టెండర్ మేము వేయలేదని కిమ్స్ చెప్పింది. ప్రేమ్ చాంద్ షాకి ఆదోని మెడికల్ కాలేజ్ ఇస్తున్నట్లు సత్యకుమార్ ప్రకటించాడు. కిమ్స్ 26 ఆసుపత్రిలో ప్రేమ్ చాంద్ షా అనే వ్యక్తి లేడు. ఉన్నాడని ఆధారాలతో నిరూపించగలడా?. లక్ష కోట్లు ఆస్తులు దోచేస్తున్నారు..
అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం..
అమరావతిలో తుమ్మ చెట్లు కొట్టం.. నీళ్లు తోడం అని ప్రతీ మూడు నెలలకు నారాయణ చెపుతున్నారు. ప్లాట్స్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాటి సింగపూరు వాళ్ళు ఏమైపోయారు?. సింగపూర్ అమరావతి కట్టినట్లు ఉంది.. మెడికల్ కాలేజీల పరిస్థితి. నూతన సంవత్సర వేడుకలకు విదేశాలు పోతారు.. మీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంత?. పోలీస్ వాహనాలకు డీజిల్ ఇచ్చారా? ఒక్క పైసా కూడా నేటికి ఇవ్వలేదు. ఏపీలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోతుందని కేంద్రం చెప్పింది. ఏదో ఒక రోజు పోలీసులు చంద్రబాబుపై సహాయ నిరాకరణ చేస్తారు. చంద్రబాబు చరిత్ర అసత్యాలు, బురిడీలు, మాయమాటలు చెప్పడమే. చంద్రబాబు మూడు లక్షల కోట్లు అప్పు చేశారు.. వచ్చిన ఆదాయం ఏం చేశారు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.


