పరకామణి కేసులో కొత్త కుట్రలు | Bhumana Karunakar Reddy fires against CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పరకామణి కేసులో కొత్త కుట్రలు

Feb 23 2026 5:10 AM | Updated on Feb 23 2026 5:10 AM

Bhumana Karunakar Reddy fires against CM Chandrababu Naidu

సీఎం చంద్రబాబుపై భూమన ధ్వజం 

కోర్టు పరిధిలో ఉన్న కేసును తిరగదోడి అవినీతిపరుడైన అధికారితో వేధించే కుతంత్రం 

న్యాయస్థానాలంటే లెక్కలేదా బాబూ? 

కల్తీ మూలాలన్నీ మీ దగ్గరే..

సాక్షి ప్రతినిధి, తిరుపతి: న్యాయస్థానం పరిధిలో ఉన్న పరకామణి కేసును రాజకీయ వేధింపులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ ఉనికి కోసం దైవత్వాన్ని, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారాలు చేస్తూ ఎదుటివారిపై నెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతుకొవ్వు లేదని, వైఎస్సార్‌సీపీకి దీంతో సంబంధం లేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్‌ తేల్చి చెప్పినా మళ్లీ అబద్ధాలకు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వన్‌ మ్యాన్‌ కమిషన్‌ వేయడం చట్టవ్యతిరేకమే కాదు.. సుప్రీం కోర్టును ధిక్కరించడం, అవహేళన చేయడమేనని, చంద్రబాబుకు న్యాయస్థానం మెట్టికాయలు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి మూలాలు చంద్రబాబు సొంత సంస్థలైన హెరిటేజ్, ఇందాపూర్‌ డెయిరీల దగ్గరే ఉన్నాయని తేల్చి చెప్పారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే నాడు అలిపిరిలో క్లైమోర్‌ మైన్స్‌ పేలాయని ఎందుకు అనుకోకూడదని ప్రశ్నించారు. ఆదివారం తిరుపతిలో క్యాంపు కార్యాలయంలో మేయర్‌ డాక్టర్‌ శిరీషతో కలిసి భూమన మీడియాతో మాట్లాడారు. 

»  పరకామణి కేసుకు సంబంధించి సీఐడీ సిట్‌ నివేదిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంటే మళ్లీ తిరగదోడి కొత్త కేసు బనాయించాలన్న ఆలోచన ఎందుకు? అత్యంత అవినీతిపరుడైన ఓ డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు మాకు సమాచారం ఉంది.  

»    లడ్డూ సువాసన రావడానికి 2018లోనే ఫ్లేవర్డ్‌ ఘీని రోజుకు 975  కేజీల చొప్పున రూ.5 కోట్ల విలువైన నెయ్యి ఎందుకు కొన్నారు చంద్రబాబూ? లడ్డూపై సువాసన రావడానికి నెయ్యి అద్దారు  అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి వాడారు అనే కదా అర్ధం? అధికారంలోకి వచి్చన వెంటనే లడ్డూ నాణ్యత పెంచడానికి శ్యామలరావును ఈవోగా నియమిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశానని చెబుతున్న చంద్రబాబు.. అదే శ్యామలరావును 20 నెలలు గడవకముందే ఎందుకు పంపించేశారు?  

»   ఏడు కొండలు కోసం 746 జీవో తెచ్చి 352 కి.మీ. పరిధి అంతా తిరుమల క్షేత్రం అని నిర్ణయించిందే వైఎస్‌ రాజశేఖరరెడ్డి అయితే.. 2009 ఎన్నికల సభలో అదే జీవో 746ని రద్దు చేస్తామని మైనార్టీల సభలో మాట్లాడిన వ్యక్తి మీరు కాదా చంద్రబాబూ?  

»  తాను శాంతపరుడినని చెప్పుకొనే∙చంద్రబాబు గతాన్ని మర్చిపోవద్దు. ఎన్టీఆర్‌ అభిమాని మల్లెల బాబ్జీ, సీఎం సెక్రటరీ రాఘవేంద్రరావు, కాపులకు అత్యంత ప్రీతిపాత్రుడైన వంగవీటి రంగా మరణాల వెనుక మీ హస్తం ఉందన్న ఆరోపణలు ఎదుర్కోలేదా?   

»  రాష్ట్రంలో పోలీసులకు రెండేళ్లుగా సరెండర్‌ లీవులు, ప్రమోషన్లు, టీఏలు లేవు. ముద్దాయిలను కోర్టులకు తీసుకెళ్లడానికి తమ దగ్గర వాహనాలు లేవని డీజీపీ ప్రకటించడం దారుణం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో 130 మంది సీఐలు వీఆర్‌లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement