భారత్, ఫ్రాన్స్‌ నౌకాదళాధికారుల భేటీ | India and France navy officers meet in andhra pradesh | Sakshi
Sakshi News home page

భారత్, ఫ్రాన్స్‌ నౌకాదళాధికారుల భేటీ

Feb 23 2026 6:06 AM | Updated on Feb 23 2026 6:06 AM

India and France navy officers meet in andhra pradesh

ఫ్రాన్స్‌ నౌకాదళ ఉన్నతాధికారులతో భేటీ అయిన ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ భల్లా

ఫ్రాన్స్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ వోజౌర్‌తో ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ భల్లా చర్చలు

వియత్నాం, తైమూర్‌ నేవీ చీఫ్స్‌తోనూ భేటీ

సాక్షి, విశాఖపట్నం: భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేసేందుకు తూర్పు నౌకాదళాధి­పతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌భల్లా, ఫ్రాన్స్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ నికోలస్‌ వోజౌర్‌ ఆదివారం సమావేశమయ్యారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ– 2026, మిలాన్‌–2026లో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ నౌకాదళం నగరానికి వచ్చింది. ఇందులో భాగంగా నౌకాదళాధిపతులు కీలక భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సముద్ర భద్రత, కార్యకలాపాల సమన్వయం, వృత్తిపరమైన మార్పి­డిపై కీలక చర్చలు జరిపారు.

ఇటీవల భారత్‌ – ఫ్రాన్స్‌ మధ్య కుదిరిన ‘స్పెషల్‌ గ్లోబల్‌ స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌’కు సంబంధించి నౌకాదళ రంగంలో ఆధునిక సాంకేతికత, ఉమ్మడి విన్యాసాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతిని పెంపొందించడంపై దృష్టి సారించిన ఫ్రాన్స్‌కు చెందిన ‘అట్లాంటిక్‌ మారీ­టైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న క్రియాశీలక భాగస్వామ్యాన్ని చాటిచెప్పిందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.

ఈ చర్చలు భారత్‌­–ఫ్రాన్స్‌ నౌకాదళాల మధ్య నిరంతర సమన్వయాన్ని, ప్రాంతీయ భద్రతా దృక్పథంతోపాటు ఉమ్మ­డి సముద్రయాన లక్ష్యాలను ప్రతిబింబించాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ భల్లా స్పష్టం చేశారు. అదేవిధంగా వియత్నాం నేవీ డిప్యూటీ చీఫ్‌ రియర్‌ అడ్మిరల్‌ నగుయెన్‌ థీన్‌క్వాన్, తూర్పు తైమూర్‌ నేవీ చీఫ్‌ కమోడోర్‌ హిగినో దాస్‌ నెవెస్‌తోనూ ఈఎన్‌సీ చీఫ్‌ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక విన్యాసాలు, పరస్పర అవగాహన ఒప్పందాలపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement