విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సీఏ సిలబస్‌లో మార్పులు
సీఏ వృత్తిలోకి వచ్చేలా గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం
‘సాక్షి’తో ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు ప్రసన్నకుమార్
సాక్షి, విశాఖపట్నం: భారతీయ సీఏలకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రేజ్ పెరుగుతోందని, మన సీఏలు గ్లోబల్ లీడర్లని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ చెప్పారు. ఐసీఏఐ ఇప్పటికే ఆ్రస్టేలియా, కెనడా, ఇంగ్లండ్, ఐర్లండ్ మొదలైన 8 దేశాలతో మ్యూచువల్ రికగి్నషన్ అగ్రిమెంట్ (ఎంఆర్‌ఏ) కుదుర్చుకుందని తెలిపారు. ఐసీఏఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విశాఖ నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మన సీఏలు ఏదైనా దేశం వెళ్లి రెండు లేదా మూడుపేపర్లు రాసి సులువుగా మెంబర్‌షిప్ పొందుతున్నారని తెలిపారు.
దీనివల్ల భారతీయ సీఏలు విదేశాల్లో ఎలాంటి అదనపు పరీక్షలు లేకుండా ప్రాక్టీస్ చేసే లేదా ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తోందని చెప్పారు. ఇది దేశీయ మేధస్సుకు గ్లోబల్ గుర్తింపే కాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ‘రాష్ట్రంలో ఐసీఏఐ ఆధ్వర్యంలో రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం.. ఆడిటింగ్, అకౌంటింగ్ రంగంలో మైలురాయిగా నిలవనుంది. ఇది కేవలం శిక్షణ కేంద్రంగానే కాకుండా, ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించిన పరిశోధనలకు వేదికగా మారుతుంది. స్థానిక నిపుణులకు ప్రపంచస్థాయి నైపుణ్యాలను అందించడం ద్వారా, మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. సాంకేతికత ఆధారంగా పాత, కొత్త చట్టాల్ని మరింత సులభతరం చేసేందుకు ఐసీఏఐ అడుగులు వేస్తోంది’ అని ప్రసన్నకుమార్ చెప్పారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి ప్రాధాన్యత
‘చాలామంది విద్యార్థుల్లో సీఏ కోర్సు అంటే ఒక రకమైన భయం ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఐసీఏఐ కాలానుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తోంది. గతంలో పదేళ్లకోసారి సిలబస్ మార్చేవారు. ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. సిలబస్ తగ్గించలేంగానీ.. మార్పులు జరుగుతున్నాయి. కేవలం థియరీకి పరిమితం కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నాం. మారుతున్న టెక్నాలజీ, గ్లోబల్ ఎకానమీకి అనుగుణంగా పాఠ్యాంశాలను సరళీకృతం చేయడం ద్వారా, మరింతమంది గ్రామీణ విద్యార్థులు కూడా ఈ వృత్తిలోకి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. సీఏపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కామర్స్ ఎడ్యుకేషన్ సిలబస్ తయారు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోంది’ అని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
ఆడిటింగ్‌లోనూ ఏఐ, డేటా అనలిటిక్స్ వినియోగం
‘ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆడిటింగ్ అంటే కేవలం లెక్కలు చూడటం మాత్రమే కాదు.. వేలకోట్ల డేటాను విశ్లేషించడం. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్ వినియోగం వల్ల ఆడిటింగ్ ప్రక్రియలో వేగం, కచ్చితత్వం పెరిగాయి. గతంలో మ్యాన్యువల్‌గా చేసే పనులను ఇప్పుడు ఏఐ సెకన్లలో పూర్తిచేస్తోంది. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఐసీఏఐ తన సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వచ్చే రెండేళ్లలో ఏఐ టూల్స్ వినియోగించని సీఏ ఉండరు. మేం కూడా ఏఐ టూల్స్‌ని అభివృద్ధి చేసి సభ్యులకు ఉచితంగా ఇస్తున్నాం. దీనిపై కమిటీ కూడా ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. విద్యా సంస్కరణలతో చార్టర్డ్ అకౌంటెంట్లను కేవలం లెక్కల ఆడిటర్లుగా కాకుండా బిజినెస్ సొల్యూషన్ ప్రొవైడర్లుగా మార్చాలన్నదే ఐసీఏఐ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


