సర్కారు తీరు వల్లే సంక్షోభంలో ‘చేనేత’ | Demand of the leaders of the Joint Action Committee in the Chenetha Garjana | Sakshi
Sakshi News home page

సర్కారు తీరు వల్లే సంక్షోభంలో ‘చేనేత’

Feb 23 2026 5:17 AM | Updated on Feb 23 2026 5:20 AM

Demand of the leaders of the Joint Action Committee in the Chenetha Garjana

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి 

‘చేనేత గర్జన’లో ఐక్య కార్యాచరణ కమిటీ నేతల డిమాండ్‌ 

ఏటా రూ.25 వేల సాయం హామీ ఏమైందని నిలదీత 

అర్హత ఉన్నప్పటికీ ఎందుకు పింఛన్లు ఇవ్వడం లేదని మండిపాటు 

నేత కార్మికుల నినాదాలతో దద్దరిల్లిన మంగళగిరి  

ఆలయం నుంచి నేతన్న విగ్రహం వరకు మహా ప్రదర్శన  

మంగళగిరి టౌన్‌ : చేనేత పరిశ్రమను చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మండిపడ్డారు. తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన చేనేత కార్మికులు ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. 

దేవస్థానం వద్ద నుంచి మొదలైన మహా ప్రదర్శన మెయిన్‌ బజార్, గౌతమ బుద్ధ రోడ్, ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌ మీదుగా నేతన్న సర్కిల్‌ వరకు సాగింది. అక్కడ నేతన్న విగ్రహానికి నూలు దండలు వేసి నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వినర్‌ పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటైన చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్నిమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఇలా రోడ్డుపైకి వచ్చామని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి కనీసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.115 కోట్లు మాత్రమే కేటాయించడం చిన్నచూపు చూడడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం అందించిందని, ఈ ప్రభుత్వం ఆ మేరకు కూడా సాయం చేయడం లేదన్నారు. 

కమిటీ కో కన్వినర్లు పిల్లలమర్రి బాలకృష్ణ, బండారు ఆనంద ప్రసాద్‌లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్నా, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం దురదృష్టకరం అన్నారు. కాగా, భారీగా తరలి వచ్చిన నేత కార్మికుల నినాదాలతో మంగళగిరి పట్టణం దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు దుర్గారావు, రమేష్, కృష్ణప్రసాద్, మాచర్ల మోహన్, రామనాథం పూర్ణచంద్రరావు, అప్పారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

ఇవీ నేతన్నల డిమాండ్లు
»  చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలి. 
»   రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించడంతోపాటు సకాలంలో ఆ నిధులు విడుదల చేయాలి. 
»   ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేలు బకాయిలు సహా వెంటనే ఇవ్వాలి. 
»    హ్యాండ్‌లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌పై వెంటనే ఆదేశాలివ్వాలి. » మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. 
»  ప్రభుత్వ సంస్ధలు చేనేత వ్రస్తాలను వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలి.  
» ప్రతి చేనేత కుటుంబానికి మూడు సెంట్ల భూమిని కేటాయించి హౌస్‌ కమ్‌ షెడ్లు నిర్మించాలి. 
»  చేనేత కార్మికులకు పెన్షన్ల మంజూరులో జాప్యం నివారించాలి.  
»  చేనేత సహకార సంఘాల పాలక మండళ్లకు వెంటనే ఎన్నికలు జరపాలి. చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. 
» కేంద్ర స్ధాయిలో హ్యాండ్‌లూమ్‌ బోర్డును పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement