పసుపు చెంప పిట్ట , పసుపు గొంతు బుల్‌బుల్ పిట్ట , లీసెర్ విజిలింగ్ డక్ బేబీ
శేషాచల అడవుల్లో గుర్తించిన గరుడ అట్లాస్ బృందం
తిరుపతి ప్రాంతంలో ఇప్పటివరకు 274 పక్షిజాతుల గుర్తింపు
తిరుపతి సిటీ: తిరుపతి శేషాచల అడవుల్లో తిరుపతి నేచర్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో మరో మూడు అరుదైన పక్షి జాతుల్ని గుర్తించినట్టు గరుడ అట్లాస్ బృందం ఆదివారం వెల్లడించింది. తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్) బృందంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 50 మంది పరిశోధకులు పక్షిజాతుల గణన, వాటి వైవిధ్యం, మనుగడ, జీవన విధానంపై ప్రత్యేక సర్వే చేపట్టారు.
2022లో ఏర్పడిన తిరుపతి బర్డ్ అట్లాస్ ఇటీవల గరుడ అట్లాస్‌గా పేరు మార్చుకుని తిరుపతి పరిసర ప్రాంతాల్లోనూ, శేషాచల అడవుల్లోనూ సంచరించే పక్షిజాతుల డేటాను సేకరించేందుకు శ్రీకారం చుట్టింది. విడతల వారీగా అటవీ ప్రాంతాలలో సర్వే చేపట్టి అరుదైన పక్షి జాతులను గరుడ అట్లాస్ బృందాలు కెమెరాల్లో బంధిస్తున్నాయి.
తిరుపతి ప్రాంతంలో తొలిసారిగా పసుపు చెంప పిట్ట (ఇండియన్ ఎల్లో టిట్) అనే అరుదైన పక్షిని కనిపెట్టామని గరుడ అట్లాస్ ప్రతినిధులు చెప్పారు. వీటితో పాటు పసుపు గొంతు బుల్‌బుల్ పిట్ట (ఎల్లో థ్రోటెడ్ బుల్‌బుల్), లీసెర్ విజిలింగ్ డక్ బేబీ వంటి అరుదైన పక్షిజాతులు తిరుపతి ప్రాంతంలో ఉండటం విశేషమన్నారు. కొండలపై నివసించే రాప్టర్ ఐన్ షాహీన్ ఫాల్కన్ పక్షులు సైతం తిరుమల ఘాట్ రోడ్డులో ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం హర్షణీయమని తెలిపారు.
ఇప్పటివరకు 274 పక్షిజాతుల గుర్తింపు
మానవ సమాజంతో పక్షిజాతుల అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు ఐజర్ బృందంలో పరిశోధకుడైన హరీష్ పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ బృందాలు ఇప్పటివరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 55 వేల పక్షుల గమనాలను పరిశీలించాయని చెప్పారు.
ఇందులో 274 పక్షిజాతులు ప్రకృతిలో మమేకమై ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 5 ఎడిషన్లలో పక్షి జాతుల డేటాను సేకరించామని, వాటిని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశామని తెలిపారు. ఆయన వెంట పుష్యామిత్ర, టీఎన్‌ఎస్ ప్రతినిధి పి రామచంద్రారెడ్డి తదితరులున్నారు.


