చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని ఇంట్లో దాచి వెళ్తే | Thief Broke Into House And Robbed 35 Tola Gold | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని ఇంట్లో దాచి వెళ్తే

Feb 23 2026 6:20 AM | Updated on Feb 23 2026 6:20 AM

Thief Broke Into House And Robbed 35 Tola Gold

బాలిరెడ్డి ఇంట్లో తెరచి ఉన్న బీరువాలు, అల్మారాలు

ఇంటి తాళం పగులగొట్టి 35 తులాల బంగారం చోరీ

ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో ఘటన

ప్రొద్దుటూరు క్రైం : బంగారం ధర పెరగడంతో బయట చైన్‌ స్నాచింగ్‌లు జరుగుతున్నాయి.. ఒంటిపై బంగారం ఉండడం మంచిది కాదని భావించి,  బంగారు ఆభరణాలను ఇంట్లో భద్రపరచి శుభకార్యానికి వెళ్లిన వారి ఇంటికి చోరులు కన్నం పెట్టారు. ఇంటికి తాళం వేసుకుని అలా వెళ్లారో లేదో కొన్ని గంటల్లోనే వారి ఇంట్లో దొంగలు పడి ఊడ్చేశారు. ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న తిమ్మయ్యకాలనీలో రాజుల బాలిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ చోరీలో సుమారు 35 తులాల బంగారు నగలను దుండగులు అపహరించారు.

త్రీటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని తిమ్మయ్యకాలనీలో రాజుల బాలిరెడ్డి కుటుంబం రెండున్నర ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడింది. అతని స్వగ్రామమైన ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామంలో ఆదివారం బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో శనివారం సాయంత్రమే ఇంటికి తాళం వేసుకుని బాలిరెడ్డి భార్య భారతితో కలిసి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటిపై ఎక్కువ బంగారం ఉండడం మంచిది కాదని భావించిన భారతి ఒక చిన్న హారం మాత్రమే మెడలో వేసుకుని మిగతా బంగారు ఆభరణాలను ఇంట్లోనే భద్రంగా దాచి వెళ్లింది. 

ఇంటి తలుపు తెరచి ఉండడంతో..
ఇంటి మెయిన్‌ గేట్‌కు తాళం వేసి.. లోపల ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి పక్కింటివాళ్లు విషయాన్ని బాలిరెడ్డికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో బాలిరెడ్డి దంపతులు హుటాహుటిన ప్రొద్దుటూరులోని ఇంటికి వచ్చి చూడగా బీరువా, అల్మారాల్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లాంగ్‌చైన్, కంకణాలు, గాజులు, రాం పరివార్‌ చైన్లు.. సుమారు 35 తులాల నగలు చోరీకి గురైనట్లు భావించారు. వెంటనే బాలిరెడ్డి దంపతులు పోలీసులకు సమాచారం అందించారు.

బంగారు చోరీపై బాలిరెడ్డి భార్య భారతి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. బాలిరెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఓ ఇంటి చుట్టూ పోలీస్‌ జాగిలం పదేపదే తిరిగింది. దీంతో పోలీసులు ఆ ఇంట్లో ఉన్న వారిని విచారణ చేస్తున్నారు. బాలిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు త్రీటౌన్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement