సాక్షి, తాడేపల్లి/ నెల్లూరు: వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామం లేదు.. ఉప ఎన్నికల్లో సైతం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కళ్లు ఉండి.. గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు.
వింజమూరు, బొమ్మనహళ్లి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘వింజమూరు, బొమ్మనహళ్లిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి అప్రజాస్వామ్యమైన పనులు చేయలేదు. ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ గుడ్డిగా వ్యవహరిస్తోంది. మా పార్టీ ఎంపీటీసీ సభ్యులను పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మహిళా ఎంపీటీసీపై దాడి చేయటంతో చేతికి గాయమైంది. అధికారులు పద్దతులు మార్చుకోవాలి. టీడీపీ గూండాలకు మద్దతుగా వ్యహరించిన వారందరి పేర్లనూ మా డిజిటల్ బుక్‌లో ఎక్కిస్తాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
మరోవైపు.. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..‘వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై అతి దారుణంగా దాడి చేశారు. మహిళా ఎంపీటీసీకి గాయలయ్యాయి. సంఖ్యా బలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. నైతికంగా వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. అనంతరం, ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. అంతేకాకుండగా మల్లికార్జున్ అనే వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.


