రెండు సంస్థల మధ్య ఒప్పందం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటెల్ భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లు (చిప్‌లు) తయారీ, అసెంబ్లింగ్ కోసం టాటా గ్రూప్‌తో చేతులు కలిపింది. ఈ విషయాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ‘‘స్థానిక మార్కెట్ల కోసం ఇంటెల్ ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్‌ను త్వరలో ప్రారంభం కానున్న టాటా ఎల్రక్టానిక్స్ ఫ్యాబ్, అండ్ ఓఎస్‌ఏటీ కేంద్రాల్లో నిర్వహించేందుకు, అత్యాధునిక ప్యాకేజింగ్‌పై సహకారాన్ని కూడా ఇంటెల్–టాటా పరిశీలించనున్నాయి’’అని టాటాగ్రూప్ తన ప్రకటనలో పేర్కొంది.
అలాగే, కన్జ్యూమర్, ఎంటర్‌ప్రైజ్ మార్కెట్ కోసం ఉద్దేశించిన ఏఐ పీసీ పరిష్కారాల విస్తరణకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు తెలిపింది. టాటా గ్రూప్ రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని దొలెరాలో చిప్ తయారీ యూనిట్‌ను, అలాగే అసోంలో ప్యాకేజింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండడం తెలిసిందే. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంప్యూటర్ మార్కెట్, కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్న భారత మార్కెట్‌లో వేగంగా విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో లిప్ బు టన్ ఈ సందర్భంగా
పేర్కొన్నారు.
‘‘ఇంటెల్‌తో ఒప్పందం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం మా ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తాయి. ఇరు సంస్థలూ కలసి సెమీకండక్టర్లు, సిస్టమ్ సొల్యూషన్లను అందించడం ద్వారా.. భారీగా విస్తరించనున్న ఏఐ మార్కెట్‌లో గణనీయమైన వాటాను సొంతం చేసుకోగలవు’’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు.


