ఫలితాల షెడ్యూల్‌లో కొత్త క్రమం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామక పరీక్షలు, ఫలితాల వెల్లడికి కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులను ప్రతిపాదించింది. ఎస్‌బీఐ, ఇతర జాతీయ బ్యాంకులు (ఎన్‌బీలు) ప్రాంతీయ సహకార బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీలు) ఖాళీల భర్తీని ఐబీపీఎస్ నిర్వహిస్తుంటుంది. ‘‘కొత్తగా నియమితులైన వారు ఆర్‌ఆర్‌బీల నుంచి ఎన్‌బీలకు, అక్కడి నుంచి ఎస్‌బీఐకి వలస వెళుతున్న ధోరణి కనిపిస్తోంది.’’అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది.
దీంతో నియామక పరీక్షలు, ఫలితాల వెల్లడి క్రమంపై సమగ్రమైన సమీక్ష నిర్వహించి, ఫలితాల విడుదలపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు కీలక మార్పులు సూచించినట్టు తెలిపింది. ‘‘దీని ప్రకారం ఇకపై ముందుగా ఎస్‌బీఐ నియామక ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. అనంతరం ఎన్‌బీలు, ఆ తర్వాత ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదల చేయాలి. అలాగే, ఆఫీసర్ స్థాయి నియామక పరీక్షలను ముందుగా విడుదల చేసిన తర్వాతే క్లరికల్‌స్థాయి ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది’’అని ప్రకటించింది.


