రిటైల్ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు జెన్ జెడ్, మిలీనియల్స్ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.
దీర్ఘకాల దృక్పథం..
ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్‌లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది.
ఫండ్స్-ఈక్విటీలకు ప్రాధాన్యం..
సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్ పార్ట్‌నర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ తెలిపారు.


