ప్రభుత్వ కార్యక్రమాలకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ నిధులు స్వాహా
ఇటీవల ఎకనమిక్ బోర్డుకు రూ.3.60 కోట్లు సంతర్పణ
కళాశాల విద్య డైరెక్టరేట్‌లో పని చేస్తున్న కన్సల్టెంట్లకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ నుంచే జీతాలు
ఇలా ప్రైవేటు వ్యక్తుల కోసం ఏకంగా రూ.5కోట్ల వరకు వినియోగం
ఏఐ వర్సిటీ పేరిట మరో రూ.2 కోట్ల వరకు చెల్లింపులు?
విద్యార్థులకు ఉపయోగపడాల్సిన నిధులను దారిమళ్లిస్తున్న చంద్రబాబు సర్కార్
ఉన్నత విద్యా మండలిని నిర్వీర్యం చేసి ప్రత్యేక కమిషనరేట్‌గా మార్చేందుకు అడుగులు
ఉన్నత విద్యా మండలి ఖజానాలో కోట్ల రూపాయలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పావులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశాబ్దాలకుపైగా విద్యా అభ్యున్నతికి తలమానికంగా నిలిచిన ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) నిర్వీర్యానికి తెరవెనుక మంత్రాంగం నడుస్తోంది. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును విస్మరించి ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా కుట్ర సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన విద్యా సంబంధిత అంశాలను నెలలు తరబడి పెండింగ్‌లో పెడుతున్న ఉన్నత విద్యా శాఖ అధికార యంత్రాంగం... నిధులను దారిమళ్లించడంలో మాత్రం అత్యుత్సాహం చూపిస్తోంది.
ఏడాదిన్నరగా ఉన్నత విద్యా శాఖకు, ఉన్నత విద్యా మండలికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థల ఉనికిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది.
రూ.10 కోట్లు హాంఫట్!
వాస్తవానికి ఉన్నత విద్యా మండలి అకడమిక్ సంస్కరణలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. తద్వారా విద్యార్థులను ప్రస్తుత అవసరాలతోపాటు భవిష్యత్తులోనూ ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. కానీ, ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలను ప్రభుత్వం (ఉన్నత విద్యాశాఖ) కనీసం పట్టించుకోవట్లేదు. అయితే పేద విద్యార్థులు కట్టిన ఫీజుల ద్వారా ఏపీఎస్‌సీహెచ్‌ఈకి వచ్చిన నిధులను మాత్రం ఖాళీ చేస్తోంది.
ఇటీవల ఉన్నత విద్యా మండలి నుంచి ఏకంగా రూ.3.60 కోట్లను ఎకనమిక్ బోర్డుకు మళ్లించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏఐ యూనివర్సిటీ పేరిట మరో రూ.2కోట్ల వరకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ డబ్బులనే వాడేసినట్టు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా కళాశాల విద్యలో పని చేస్తున్న కన్సల్టెంట్ల కోసం ఉన్నత విద్యా మండలికి చెందిన సుమారు రూ.5 కోట్ల నిధులను సైతం వెచ్చించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఇలా విద్యా ప్రమాణాల మెరుగుదలకు వినియోగించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.
గతంలోనూ ఇదే తంతు?
అకడమిక్ విషయాల్లోని ప్రవేశాల నిర్వహణ, కరిక్యులమ్ రూపకల్పన వంటి విద్యా సంబంధిత అంశాలను ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యా మండలి అధికారాలను, పరిధిని తగ్గించే ప్రయత్నం ప్రారంభమైంది. కొందరు అధికారులు, షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న ఓ ఓఎస్డీ నేతృత్వంలో ఈ కథ సాగుతోందని సమాచారం. ఉన్నత విద్యా మండలికి ప్రవేశాల నిర్వహణ ద్వారా ఆదాయం వస్తుంది.
ఇది గమనించిన సదరు అధికారులు, షాడో మంత్రి ద్వయం ఖజానాపై కన్నేసినట్టు కనిపిస్తోంది. అందుకే విద్యార్థుల ప్రవేశాలను ఉన్నత విద్యా మండలి నుంచి తప్పించి ప్రత్యేకంగా ఉన్నత విద్య కమిషనరేట్‌ను ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యా మండలి నుంచి ప్రవేశాలను కళాశాల విద్యకు కేటాయించారు.
నిధులు ఖాళీ అయిపోయిన తర్వాత తాము నిర్వహించలేమని కళాశాల విద్య చేతులు ఎత్తేయడంతో మళ్లీ ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలను అప్పగించారు. తాజాగా మళ్లీ అలాంటి కథ తెరపైకి రావడం గమనార్హం.


