ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామక పరీక్షల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రిక్రూట్‌మెంట్ పరీక్షల కాలక్రమాన్ని క్రమబద్ధీకరించడం, వాటి ఫలితాల ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పలు మార్పులను సూచించింది. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), జాతీయ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRB) నియామకాలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాము సూచించిన మార్పులు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించే పరీక్షలలో పారదర్శకతను పెంచడానికి దోహదపడతాయని పేర్కొంది. ఎస్‌బీఐలో ఉద్యోగాలకు నియామకాలకు తానే సొంతంగా రిక్రూట్‌మెంట్ చేపడుతుండగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆర్ఆర్‌బీలలో రిక్రూట్‌మెంట్‌ను ఆయా బ్యాంకుల ఆదేశాలకు అనుగుణంగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.
సాధారణంగా ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఎస్‌బీఐలలో ఉద్యోగాల పరీక్షల కంటే ముందే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అంటే ఆర్‌ఆర్‌బీలకు నియామక పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలను కూడా ఇదే క్రమంలో ప్రకటిస్తున్నారు. "అయితే, కొత్తగా నియమితులైన అభ్యర్థులు తరచుగా ఆర్ఆర్‌బీల నుండి ఇతర ప్రభుత్వ బ్యాంకులకు, తరువాత ఎస్‌బీఐకి మారే ఒక ముఖ్యమైన ధోరణి ఉద్భవించింది. ఈ వలస బ్యాంకులలో గణనీయమైన అట్రిషన్ కు దారితీస్తూ కార్యాచరణ సవాళ్లను విసురుతోంది" అని ఆర్థిక సేవల విభాగం తెలిపింది.
పై సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఆర్థిక సేవల విభాగం బ్యాంకుల రిక్రూట్‌మెంట్ పరీక్షల సమగ్ర ప్రక్రియ, ఫలితాల ప్రకటనల నమూనాను సమీక్షించింది. మూడు రకాల బ్యాంకులలో నియామక ఫలితాలను ప్రకటించడానికి ప్రామాణిక, తార్కిక క్రమాన్ని అమలు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు సూచించింది.
పర్యవసానంగా, సవరించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీని ప్రకారం.. మొదట ఎస్‌బీఐ, అనంతరం ఇతర ప్రభుత్వ బ్యాంకులు, ఆ తరువాత చివరగా ఆర్‌ఆర్‌బీలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించాలి. ఈ కేటగిరీలలోని అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ప్రారంభంలో ప్రకటిస్తామని, క్లరికల్ స్థాయి పరీక్ష ఫలితాలను అదే క్రమంలో ప్రకటిస్తామని తెలిపింది.


