స్విట్జర్లాండ్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్ రాబోయే మూడేళ్లలో సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను పరిశీలిస్తోందని స్విస్ వార్తాపత్రిక ‘సోన్‌టాగ్స్ బ్లిక్’(SonntagsBlick) తెలిపింది. 2023లో క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.
బ్యాంకు వ్యవస్థలో పునరావృత కార్యకలాపాలను తగ్గించడానికి ఈ ఉద్యోగ కోతలు, విలీన ప్రక్రియ ఎంతో తోడ్పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే యూబిఎస్ ప్రతినిధులు ఈ 10,000 సంఖ్యను మాత్రం కచ్చితంగా ధ్రువీకరించలేదని గమనించాలి.
క్రెడిట్ సూయిస్ కొనుగోలు (మార్చి 2023) తర్వాత యూబీఎస్ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా వీలైనంత తక్కువగా ఉద్యోగ కోతలు ఉండేటా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూబీఎస్ ప్రతినిధులు చెప్పారు. బ్యాంకులో ఏవైనా తగ్గింపులు ఉంటే దానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణ తొలగింపుల (లేఆఫ్స్) సంఖ్యను తగ్గించడానికి బ్యాంకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం
2024 చివరి నాటికి యూబీఎస్‌లో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 10,000 కోతలు దాదాపు 9 శాతం తగ్గుదలకు సమానం. ఇప్పటికే బ్యాంక్ 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 1,04,427కి తగ్గించింది. అంటే, ఈ విలీనం ప్రభావంతో ఇదివరకే సుమారు 15,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.
ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో నరాల సమస్య


