భారతదేశంలో హైదరాబాద్ వంటి టెక్ హబ్‌ల్లో యువ ఐటీ నిపుణులు ఆరోగ్య స్పృహతో కూడిన జీవనశైలిని అవలంబిస్తున్నప్పటికీ, వారిలో కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా విటమిన్ బీ12 లోపం కారణంగా నరాల సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు గుర్తించారు. ఈ లోపాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల శాశ్వత నరాల సమస్య సంభవించవచ్చని కొందరు చెబుతున్నారు.
ఇటీవల క్లినిక్‌కు వస్తున్న యువ ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోందని, వీరంతా నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులుగా భావించే ఈ నిపుణులు రోజువారీ సాధారణంగా కనిపించే సమస్యలతో వస్తున్నారని అంటున్నారు.
సాధారణంగా కనిపించే లక్షణాలు
పాదాలలో తిమ్మిరి లేదా జలదరింపు
ఆకస్మిక ఎలక్ట్రిక్ షాక్ లాంటి అనుభూతులు
ఏకాగ్రతకు కష్టపడటం
విశ్రాంతితో మెరుగుపడని అలసట
మతిమరుపు
మెట్లు ఎక్కేటప్పుడు అప్పుడప్పుడు బలహీనత
ఈ తరహా సమస్యలు ఇటీవలి సంవత్సరాల్లో మరింత స్పష్టంగా గమనిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు
B12 లోపానికి ప్రధాన కారణాలు
టీ లేదా కాఫీ అధికంగా తీసుకోవడం
డెస్క్‌ల వద్ద ఎక్కువ గంటలు కూర్చోవడం. కదలిక లేకపోవడం, భోజనం సరిగా చేయకపోవడం.
చాలా మంది సరైన సప్లిమెంట్స్ లేకుండా ఆహారాన్ని తీసుకుంటారు.
మెట్ఫార్మిన్ (డయాబెటిస్ కోసం) లేదా యాసిడ్-తగ్గించే మందులు (పీపీఐ) వంటి వాటిని దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల బీ12 మరింత తగ్గుతుంది.
క్రమరహిత నిద్ర, పని సంబంధిత ఒత్తిడి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది కూడా బీ12 తగ్గిస్తుంది.
శాశ్వత నష్టాన్ని నివారించడం అత్యవసరం
నరాల ఇన్సులేషన్ (మైలిన్), మెదడు పనితీరు, మానసిక స్థితి సమతుల్యత, ఆరోగ్యకరమైన రక్త కణాలకు విటమిన్ బీ12 కీలకమని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువ కాలం లోపం కొనసాగితే నరాల నష్టం కోలుకోలేనిదిగా మారవచ్చు. చాలా మంది యువ నిపుణులు తమ లక్షణాలను కేవలం పని ఒత్తిడిగా లేదా అలసటగా భావించి విస్మరిస్తారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడేం చేయాలి?
ప్రాథమిక రక్త పరీక్ష ద్వారా విటమిన్ బీ12 స్థాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రారంభ దశలో సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా సాధారణంగా పూర్తిగా కోలుకోవడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. జలదరింపు, తిమ్మిరి, నిరంతర అలసట వంటి సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక నరాల సమస్యలను నివారించడానికి ఏటా విటమిన్ బీ12 స్థాయిలను తనిఖీ చేయాలని, ఏదైనా సమస్యలకు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే స్పందించాలని సిఫార్సు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మిడ్‌నైట్ కార్నివాల్ పేరుతో రూ.4 లక్షల వరకు డిస్కౌంట్


