స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఉద్యోగుల వసతి అవసరాలను తీర్చడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో భారీ బల్క్ హౌసింగ్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా బ్యాంక్ దాదాపు రూ.294 కోట్లు (పన్నులు మినహాయించి) వెచ్చించి, అపార్ట్‌మెంట్లలో మొత్తం 200 2 బీహెచ్‌కే ఫ్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇటీవలి సంవత్సరాల్లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇది అతిపెద్ద సంస్థాగత నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది.
ఎస్‌బీఐ ఇటీవల జారీ చేసిన టెండర్ పత్రాల ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌లో ముంబయి ఒకటి. దాంతో అక్కడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఈ వ్యూహాత్మక బల్క్ కొనుగోలును నాలుగు క్లస్టర్‌లుగా విస్తరించింది.
సెంట్రల్ శివారు ప్రాంతాలు (సియోన్ నుంచి ఘాట్‌కోపర్ వరకు). పశ్చిమ శివారు ప్రాంతాలు (అంధేరి నుంచి బోరివలి వరకు). థానే-కళ్యాణ్ బెల్ట్. నవీ ముంబై కారిడార్ (ఖర్‌ఘర్ నుంచి పన్వెల్ వరకు) విభజించింది. ప్రతి క్లస్టర్‌లో 50 యూనిట్ల చొప్పున మొత్తం 200 2-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేయనుంది. ప్రతి అపార్ట్‌మెంట్ కార్పెట్ ఏరియా సుమారు 600 చదరపు అడుగులు (55.74 చదరపు మీటర్లు) ఉండాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రాజెక్ట్ 5 ఏళ్లలోపుదై ఉండాలి. మహారెరా కంప్లీషన్ సర్టిఫికేట్ (OC)తో మహారెరా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతి ఫ్లాట్‌కు ఒక కారు పార్కింగ్, ఒక ద్విచక్ర వాహనం పార్కింగ్ చొప్పున మొత్తం 400 పార్కింగ్ స్లాట్‌లు తప్పనిసరి ఉండాలని చెప్పింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేసిన తేదీ నుంచి 6 నెలల్లోగా (180 రోజులు) లావాదేవీని పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
🚨 State Bank of India is planning to buy 200 ready-to-move 2BHK apartments across Mumbai for its staff. pic.twitter.com/LgLD0vfJpQ
— Indian Tech & Infra (@IndianTechGuide) December 8, 2025
ఈ బల్క్ కొనుగోలు ద్వారా ఉద్యోగులకు ముంబైలో పెరుగుతున్న ఆస్తి ధరలతో సంబంధం లేకుండా స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలు అందించాలని బ్యాంక్ చూస్తోంది. సిబ్బంది సంక్షేమం, గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం (ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్) రెంటల్ లేదా లీజు ఏర్పాట్ల కంటే నేరుగా రెడీ-టు-మూవ్ గృహాలను కొనుగోలు చేసే ధోరణి పెరుగుతున్నట్లు ఈ చర్య స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?


