జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో సానుకూలత
పండుగల సమయంలో భారీగా కొనుగోళ్లు
ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై–సెపె్టంబర్ త్రైమాసికం)7.5 శాతం మించి నమోదు కావొచ్చని ఎస్‌బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపునకు తోడు, పండుగల సమయంలో విక్రయాలు బలంగా నమోదు కావడం మెరుగైన వృద్ధికి దారితీయొచ్చని పేర్కొంది. అలాగే, పెట్టుబడులు పుంజుకోవడం, గ్రామీణ వినియోగం కోలుకోవడాన్ని ప్రస్తావించింది.
‘‘పండుగల నేపథ్యంలో అమ్మకాలకు సంబంధించి మంచి గణాంకాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలకు సంబంధించి వినియోగం, డిమాండ్‌ను సూచించే సంకేతాలు క్యూ1లో ఉన్న 70 శాతం నుంచి క్యూ2లో 83 శాతానికి పెరిగాయి. వీటి ఆధారంగా క్యూ2లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న అంచనాకు వచ్చాం’’అని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.
ఈ నెల చివర్లో క్యూ2 జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉండడం గమనార్హం.
జోరుగా జీఎస్‌టీ వసూళ్లు..
నవంబర్ నెలకు జీడీపీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.8 శాతం అధికమని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. దిగుమతులపై ఐజీఎస్‌టీ, సెస్సు రూపంలో ఆదాయం రూ.51,000 కోట్లుగా ఉంటుందని.. దీంతో నవంబర్ నెలకు మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లను మించొచ్చని పేర్కొంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు గత నెలలో పండుగల విక్రయాలను గణనీయంగా పెంచడాన్ని గుర్తు చేసింది.
క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు వ్యయాలు సైతం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. యుటిలిటీలు, సేవలపై 38 శాతం, సూపర్ మార్కెట్, గ్రోసరీ కొనుగోళ్లపై 17 శాతం, పర్యటనలపై 9 శాతం ఖర్చు చేసినట్టు తెలిపింది. పట్టణాల వారీగా క్రెడిట్ కార్డు వ్యయాలను పరిశీలించగా, డిమాండ్ అన్ని ప్రాంతాల్లోనూ అధికమైనట్టు పేర్కొంది. అన్ని పట్టణాల్లోనూ ఈ–కామర్స్ విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది.
ఇక్రా అంచనా 7 శాతం
సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సేవలు, వ్యవసాయ రంగంలో రెండో త్రైమాసికంలో కొంత జోరు తగ్గిందంటూ.. తయారీ, నిర్మాణ రంగం, సానుకూల బేస్ మద్దతుతో పారిశ్రామిక పనితీరు బలంగా ఉన్నట్టు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ2లో జీడీపీ 5.6 శాతంగా ఉండడం గమనార్హం.
క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. అయినప్పటికీ పండుగల సీజన్‌లో అమ్మకాలు, జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ కారణంగా పెరిగిన అమ్మకాలు, టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందుగా అమెరికాకు అధిక ఎగుమతులు జరగడం వృద్దికి మద్దతునివ్వొచ్చని చెప్పారు.


