బంగారం, వెండిపై పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా.. యాక్సిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ న్యూ ఆఫర్.
ఈ నెల 10న మొదలు కాగా, 22వ తేదీన ముగియనుంది. ఈ ఒక్క పథకం ద్వారా ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరల ర్యాలీలో భాగం కావొచ్చని సంస్థ ప్రకటించింది. ఈ పథకం గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్‌లల్లో 50:50 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంది. కనీసం రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
‘‘చారిత్రకంగా చూస్తే బంగారం, వెండి ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరతలకు చక్కని హెడ్జింగ్ సాధనంగా పనిచేశాయి. అదే సమయంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ప్రయోజనాలను సైతం పోర్ట్‌ఫోలియోకి అందిస్తాయి’’అని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో బి.గోపకుమార్ తెలిపారు.
ఇన్వెస్టర్లు ఈ పథకంలో లంప్‌సమ్‌తో పాటు ఎస్‌ఐపీ మార్గంలోనూ పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. ప్యాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కావడంతో ఇందులో దూకుడుగా స్టాక్‌లను ఎంపిక ఉండదు. అంటే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల పనితీరును అనుసరిస్తుంది. అందువల్ల ఫండ్ మేనేజర్ రిస్క్ తక్కువగా ఉండగా, ఖర్చులు కూడా సాధారణంగా నియంత్రిత స్థాయిలోనే ఉంటాయని సంస్థ తెలిపింది.
అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, వడ్డీ రేట్లు, డాలర్ మారకం విలువ వంటి అంశాలపై ఆధారపడి మారుతుంటాయి కాబట్టి తక్కువకాలంలో ఊగిసలాటలు ఉండొచ్చు. దీర్ఘకాల పెట్టుబడిదారులు, తమ పోర్ట్‌ఫోలియోలో స్థిరత్వం, వైవిధ్యం కోరుకునేవారికి ఈ పథకం అనుకూలంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు స్కీమ్ సమాచార పత్రం (ఎస్‌ఐడీ)ను జాగ్రత్తగా చదువుకోవడం చాలా అవసరం.


