బంగారం ధరలు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరుగు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పసిడి రేటు 10 గ్రాములకు రూ.1.5 లక్షల స్థాయి దిశగా పరుగు కొనసాగించవచ్చని దేశీ బ్రోకరేజ్ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది. వెండిపై ఆసక్తి మరింతగా పెరగవచ్చని, కేజీ ధర రూ. 2.1 లక్షలకు చేరొచ్చని పేర్కొంది.
నిఫ్టీ@ 29,000 పాయింట్లు
కార్పొరేట్ల ఆదాయాలు మెరుగ్గా ఉంటున్న నేపథ్యంలో 2026 ఆఖరు నాటికి నిఫ్టీ 12 శాతం వృద్ధి చెందవచ్చని, 29,120 పాయింట్లకు చేరొచ్చని కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది. మరీ బులిష్‌గా ఉంటే నిఫ్టీ 32,032 పాయింట్లకు ఎగియొచ్చని, బేరిష్‌గా ఉంటే 26,208 పాయింట్లకు తగ్గొచ్చని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది.
‘స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు, దేశీయంగా పెరుగుతున్న పెట్టుబడుల దన్నుతో వచ్చే ఏడాది కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఉద్రిక్తతలు ఎలా ఉన్నప్పటికీ భారతదేశ దీర్ఘకాలిక మార్కెట్ వృద్ధి గాథ పటిష్టంగానే ఉంటుంది‘ అని కోటక్ సెక్యూరిటీస్ ఎండీ శ్రీపాల్ షా తెలిపారు.
ఆశావాదం గరిష్ట స్థాయిలో ఉందని, 2025 సవాళ్లతో గడిచినప్పటికీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మళ్లీ సానుకూలంగా తిరిగొస్తారని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో విస్తృత స్థాయి ర్యాలీ లేదని, నిఫ్టీ స్టాక్స్‌లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయని షా వివరించారు. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంకా ఆల్‌టైం గరిష్ట స్థాయులకు చాలా దూరంలోనే ఉన్నాయన్నారు. బడ్జెట్ వరకు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో ఆసక్తి కొనసాగుతుందని, మార్చి తర్వాత నుంచి మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పెరగడం మొదలవుతుందని కోటక్ సెక్యూరిటీస్ వర్గాలు తెలిపాయి.
బ్యాంకింగ్, బీమా సానుకూలం..
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ స్టాక్స్ సానుకూలంగా ఉన్నట్లు కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.


