అందుబాటు ధరలకే ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లు
పెట్రోల్ కారు కంటే తక్కువ ధరలకే
నిర్వహణ వ్యయం చూసినా ఎంతో తక్కువ
బ్యాటరీ గురించి అంతగా ఆందోళన వద్దు
వినియోగాన్ని బట్టే ఎంపిక ఉండాలి..
ఛార్జింగ్ సదుపాయాలనూ దృష్టిలో పెట్టుకోవాలి
ఐదేళ్ల కిందట దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్దగా లేనేలేవు. మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా నిండా ఒక శాతం కూడా లేదు. మరి ఇప్పుడో..? దాదాపుగా మూడున్నర శాతానికి చేరుకుంది. ఇదేమీ మామూలు పెరుగుదల కాదు. మరెలా సాధ్యమైంది? ఎలాగంటే అప్పట్లో ఛార్జింగ్ సదుపాయాలు తక్కువ. ధరలు ఎక్కువ. పైపెచ్చు మోడళ్లూ తక్కువే. దాంతో కొనేవారు వెనకడుగు వేసేవారు.
ఇపుడు ఛార్జింగ్ సదుపాయాలు పెరిగాయి. ప్రతి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలోనూ వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఈ రంగంలోకి వచ్చి రకరకాల మోడళ్లు తెస్తున్నాయి. వీటికి తోడు ధరలూ తగ్గాయి. అందుకే ఇపుడు జనం ఆలోచనలు మారుతున్నాయి. సరే! ఇదంతా ఒకెత్తయితే... ఆర్థికంగా మనకు ఏదైతే లాభం? ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం వెతుకుతూనే ఉన్నారు. వారికోసమే ఈ కథనం...
పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచెం ఎక్కువ. కానీ నిర్వహణ వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ కారు నిర్వహణ వ్యయమే తక్కువ. మరి మొత్తంగా చూసినపుడు ఏది బెటర్? ఇలా చూసినపుడు స్మార్ట్‌గా సేవ్ చేసుకోవటానికి సెకండ్ హ్యాండ్ (ప్రీఓన్డ్/ అప్పటికే మరొకరు వినియోగించిన) ఎలక్ట్రిక్ కారు కొనటం మంచిదంటున్నారు నిపుణులు. కొత్త పెట్రోల్ కారు కొనే బదులు ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తెచ్చుకోవటమనేది స్మార్ట్ మార్గమని సలహా ఇస్తున్నారు.
ఎలక్ట్రిక్ కారే చౌక.. అదెలా?
కొత్త వాటి ధరలు అధికంగా ఉంటుండడంతో.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఉన్న ఆదా సూత్రం చాలా మందికి నచ్చుతోంది. ఎందుకంటే పెట్రోల్ కార్లతో పోల్చినపుడు ఎలక్ట్రిక్ కార్ల విలువ వేగంగా తగ్గిపోతోంది. 2020లో రూ.12 లక్షలు పలికిన ఈవీ ధర.. ఇప్పుడు రూ.5.5 నుంచి 6.5 లక్షలకే దొరుకుతోంది.
అందుబాటు ధరలకే..
ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొత్త కొత్త ఫీచర్లు తరచూ యాడ్ అవుతూనే ఉన్నాయి. పైపెచ్చు కంపెనీలు అత్యాధునిక సదుపాయాలతో మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కొనుక్కోవటానికి సంపన్నులు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా 3– 4 ఏళ్లు తిరక్కుండానే తమ పాత వాహనాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయానికి పెడుతున్నారు. ఈ ధోరణే ఇప్పుడు మధ్య తరగతి వాసులకు కలిసి వస్తోంది. సెకండ్ హ్యాండ్‌లో పెట్రోలు కారు కొని అధిక నిర్వహణ వ్యయాన్ని భరించే బదులు... తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొని తక్కువ నిర్వహణ వ్యయంతో ముందుకెళుతున్నారు.
నిర్వహణ వ్యయం కలిసొచ్చేదిలా...
→ పెట్రోలు కారు లీటర్‌కు 15 కిలోమీటర్లు మైలేజీ ఇస్తోందనుకుందాం. దాన్లో నెలకు 1,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపుగా రూ.6,500 నుంచి రూ.7000 ఖర్చవుతుంది.
→ నెలకు ఇంతే దూరం కోసం ఎలక్ట్రిక్ కారులో గనక తిరిగితే.. ఒక కిలోమీటర్‌కు రూ.1.5 చొప్పున ఎలక్ట్రిక్ చార్జింగ్ కోసం రూ.1,500–2,000 వెచి్చస్తే సరిపోతుంది.
→ ఈ ఉదాహరణలో ఎలక్ట్రిక్ కారును వినియోగించడం వల్ల నెలవారీ రూ.5,000 వరకు ఆదా అవుతుంది.
→ ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. క్లచ్/గేర్ బాక్స్‌లు ఉండవు. కనుక ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్ కోసం ఏడాదిలో రూ.2,000–5,000 సరిపోతుంది.
→ పెట్రోల్ కారులో ఇంజన్ ఆయిల్, సర్వీసింగ్ కోసం ఏటా రూ.12,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.
‘బ్యాటరీ’పై ఆందోళన ఎందుకు?
ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీయే హృదయం. కొంత కాలానికి బ్యాటరీ పనితీరు పడిపోతుందని, అగ్ని ప్రమాదాల రిస్క్ ఉంటుందని కొందరు భయపడుతుంటారు. కానీ, ఇపుడు కంపెనీలు ఏమాత్రం రాజీ పడకుండా మెరుగైన టెక్నాలజీతో మంచి బ్యాటరీలు తెస్తున్నాయి. పైపెచ్చు కార్ల కంపెనీలు బ్యాటరీలపై ఎనిమిదేళ్ల వారంటీని లేదంటే 1,60,000 కిలోమీటర్ల వినియోగానికి వారంటీని ఆఫర్ చేస్తున్నాయి. పైగా నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పనితీరు అందరూ అనుకునేట్టు 40–50 శాతం పడిపోవడం అన్నది నిజం కాదు. 8–12 శాతమే తగ్గుతున్నట్టు యూజర్ డేటా ఆధారంగా తెలుస్తోంది.దీన్నిబట్టి చూసినపుడు మూడేళ్లు వాడిన కారును కొనుక్కున్నా మరో మూడు నాలుగేళ్లు అదే బ్యాటరీని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ మార్చాల్సి వస్తే.. అది కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటోంది.
ఐదేళ్లలో మిగిలేది బ్యాటరీకి పెట్టొచ్చు...
ప్రీఓన్డ్ ఈవీ వర్సెస్ పెట్రోల్ కారు
→ నెలవారీ వినియోగం 1,000 కిలోమీటర్లు
→ పెట్రోల్ కారుకు నెలకు ఇంధనం కోసం రూ.7,000 చొప్పున ఐదేళ్లలో రూ.4.2 లక్షలు అవుతుంది.
→ అదే ఎలక్ట్రిక్ కారుకు నెలకు రూ.2,000 చొప్పున రూ.లక్ష చాలు.
→ పెట్రోల్ కారుకు ఏటా రూ.12వేల చొప్పున ఐదేళ్లలో రూ.60వేలు మెయింటెనెన్స్ అవుతుంది.
→ ఎలక్ట్రిక్ కారుకు రూ.2–5 వేల చొప్పున రూ.10–25వేలు సరిపోతుంది.
→ ఈ రకంగా చూస్తే ఎలక్ట్రిక్ కారుపై ఐదేళ్లలో రూ.3 – 4 లక్షలు మిగులుతుంది.
→ బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చేసరికి బ్యాటరీ ఖర్చు కన్నా మనకు మిగిలేదే ఎక్కువనేది నిపుణుల మాట.
ఎవరికి ఏది అనుకూలం?
ప్రీఓన్డ్ ఈవీ:
→ పట్టణాల్లో రోజువారీ కార్యాలయానికి వెళ్లి వచ్చేందుకు అయితే ఈవీ అనుకూలం.
→ ఒక రోజులో 80 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారు దీనికి మొగ్గు చూపొచ్చు. నెలలో కనీసం 700 కిలోమీటర్లు, అంతకుమించి ప్రయాణించే వారికే ఈవీ లాభసాటి.
→ రూ.5– 8 లక్షలే పెట్టుబడి పెట్టగలిగే వారు, ఇంట్లో చార్జింగ్ వసతులు కలిగిన వారు ఇటు వైపు మొగ్గు చూపించొచ్చు.
పెట్రోల్ కారు:
→ హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు లేదా గ్రామీణ/మారుమూల ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకునే వారికి ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారు అనుకూలం. ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి చార్జింగ్ చేశాక... మైలేజ్ పరంగా పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి.
→ ఇంట్లో చార్జింగ్ సదుపాయం లేని వారికి సైతం పెట్రోల్ కారుతోనే సౌలభ్యమని చెప్పాలి.
→ నెలలో 500 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయని వారికి పెట్రోల్‌పై, కారు నిర్వహణపై పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఏర్పడదు. వినియోగం తక్కువే కనుక ఏటా విలువ గణనీయంగా తగ్గిపోయే ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారే వీరికి అనుకూలం.


