కీలకంకానున్న దేశ, విదేశీ గణాంకాలు
యూఎస్, భారత్ చర్చలపై దృష్టి
రూపాయి మారకం, బాండ్ల ఈల్డ్స్‌కు ప్రాధాన్యం
స్టాక్ మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణులు
గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు.
ఈ బాటలో నవంబర్ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్‌లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్ గరిష్టం 41.68 బిలియన్ డాలర్లను తాకింది. నవంబర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్‌లో దిగుమతుల బిల్లు 76 బిలియన్ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్ డాలర్లు మాత్రమే.
కరెన్సీ మారకంపై కన్ను
గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
కాగా.. యూఎస్ విధించిన అదనపు టారిఫ్‌లకుతోడు మెక్సికో సైతం భారత్ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్‌ల సమస్యలకు చెక్ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.
విదేశీ గణాంకాలు
యూఎస్, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్ వినియోగ ధరలు, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్‌లుక్ తదితర అంశాలు ఫెడ్ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
చిన్న షేర్లు భళా
అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్‌ఈ సెన్సెక్స్ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్‌కు
తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం!
సాంకేతికంగా ముందుకే..
చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.
→ నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్‌గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్‌లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్‌లున్నాయ్.
→ సెన్సెక్స్ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు.
– సాక్షి, బిజినెస్ డెస్క్


