10న పరపతి సమీక్షా నిర్ణయాలు
యూఎస్ ఉపాధి గణాంకాల వెల్లడి
చైనా, యూఎస్ వాణిజ్య వివరాలు
దేశీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు
ఈ వారం ట్రెండ్‌పై నిపుణుల విశ్లేషణ
ప్రధానంగా విదేశీ గణాంకాల ఆధారంగా ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు కదలనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. ఇది సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..
యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ 9న పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. 10న చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) మానిటరీ పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. ఫెడ్ ఫండ్స్(వడ్డీ) రేట్లను 0.25 శాతంమేర తగ్గించవచ్చని అధికశాతంమంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత పాలసీ సమావేశంలోనూ వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతంగా అమలవుతున్నాయి.
కాగా.. ముందు రోజు అంటే 9న యూఎస్ ఉపాధి గణాంకాలు విడుదలకానున్నాయి. 11న సెపె్టంబర్ నెలకు వాణిజ్య గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆగస్ట్‌లో వాణిజ్య లోటు 59.6 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. జూలైలో 78 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నవంబర్ నెలకు చైనా వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో చైనా 90 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 10న గత నెలకు చైనా ద్రవ్యోల్బణ వివరాలు తెలియనున్నాయి.
ఆర్‌బీఐ ఎఫెక్ట్
దేశీయంగా ఆర్‌బీఐ గత వారం వడ్డీ రేట్లకు కీలకమైన రెపోలో 0.25 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. అంతేకాకుండా రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీయనుంది. ఫలితంగా దేశీ స్టాక్ మార్కెట్లు వారాంతాన ఊపందుకున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి 90కు బలహీనపడటం గమనించదగ్గ అంశం. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి దన్నుగా ఆర్‌బీఐ 5 బిలియన్ డాలర్ల రుపీ డాలర్ స్వాప్‌నకు తెరతీయనుంది.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ చర్యలు జీఎస్‌టీ సంస్కరణలకు జత కలసి సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఇండెక్స్, ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేసే అవకాశముంది. ఇవి గ్లోబల్ ఇన్వెస్టర్లను రిస్కు పెట్టుబడులైన ఈక్విటీల నుంచి పసిడి తదితర రక్షణాత్మక సాధనాలవైపు మళ్లించవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రిటైల్ ధరలు..
నవంబర్ నెలకు వినియోగ ధరల(సీపీఐ) గణాంకాలు శుక్రవారం(12న) విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ 0.25 శాతానికి నీరసించింది. దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలు కలిగిన విషయం విదితమే. కాగా.. వరుసగా 9వ నెలలోనూ ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతానికంటే దిగువనే రిటైల్ ధరలు నమోదవుతుండటం గమనార్హం!
ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్
తొలి వారంలో రూ. 11,820 కోట్లు ఔట్
దేశీ స్టాక్స్‌లో ఇటీవల విక్రయాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల మొదటి వారంలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నగదు విభాగంలో నికరంగా రూ. 11,820 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయింది! గత నెలలోనూ రూ. 3,765 కోట్ల విలువైన స్టాక్స్‌ను నికరంగా విక్రయించిన ఎఫ్‌పీఐలు అక్టోబర్‌లో మాత్రం రూ. 14,610 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెపె్టంబర్‌లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్‌లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం!
బుల్లిష్‌గా..
గత వారం ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. రూపాయి పతనంతో ఐటీ కౌంటర్లు బలపడ్డాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం మార్కెట్లు పుంజుకోవడానికే అధిక చాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
→ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,300–26,350 పాయింట్లకు పెరిగే వీలుంది. ఈ స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. దీనిని అధిగమిస్తే స్వల్ప కాలంలో 26,850–26,900 వరకూ పురోగమించే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 26,000, తదుపరి 25,850 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. ఆపై మరోసారి 25,700 వద్ద మద్దతు కనిపించవచ్చు. ఇంతకంటే దిగువకు చేరితే మరింత నీరసించేందుకు ఆస్కారం ఉంటుంది.
→ బీఎస్‌ఈ సెన్సెక్స్ 86,350 వరకూ బలపడవచ్చు. ఈస్థాయిని దాటితే 87,500–88,000 పాయింట్లవరకూ పుంజుకునే అవకాశముంది. ఒకవేళ బలహీనపడితే తొలుత 84,800 వద్ద, తదుపరి 84,450 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించవచ్చు. ఆపై మరింత నీరసిస్తే 83,600–83,300 పాయింట్లవరకూ క్షీణించే వీలుంది.
–సాక్షి, బిజినెస్ డెస్క్


