ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం | Benefits of Self-Control and Self-Discipline | Sakshi
Sakshi News home page

ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం

Dec 8 2025 1:07 AM | Updated on Dec 8 2025 1:07 AM

Benefits of Self-Control and Self-Discipline

మంచిమాట

మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. 

దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.

చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన  విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. 

యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. 

ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను  నిర్వర్తించాడు. 

దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. 

అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది.  ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని  సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు.

 దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు.   ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది.  

మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని   భగవద్గీత కూడా స్పష్టం చేసింది.

– దాసరి దుర్గాప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement