ఆసియా పసిఫిక్ రీజియన్‌లో స్వేచ్ఛా నౌకాయానం ఉండాలి
ప్రాంతీయ భద్రతకు ఈ ప్రాంత దేశాలన్నీ కలిసి పని చేయాలి
ఏషియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత, సమ్మిళిత నౌకాయానం ఉండాలని భారత్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఎలాంటి నిర్బంధ విధానాలు సహించేది లేదని స్పష్టంచేశారు. కౌలాలంపూర్‌లో శనివారం ఆయన ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ (ఏడీఎంఎం–ప్లస్) కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. ‘చట్టంపట్ల భారత్ తన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తోంది.
ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీస్ (యూఎన్‌సీఎల్‌ఓఎస్)పై భారత్‌కు పూర్తి నమ్మకం ఉంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలన్న భారత ఆకాంక్ష ఏ దేశానికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ప్రాంత దేశాల ఉమ్మడి భద్రత, ప్రయోజనాల కోసమే మేం ఈ విధానం అవలంభిస్తున్నాం.
ఈ ప్రాంతం ఎలాంటి నిర్బంధాలు, బలప్రయోగాలు లేకుండా స్వేచ్ఛాయుతంగా ఉండాలి. భవిష్యత్తులో భద్రత అనేది కేవలం సైనిక సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వనరులు పంచుకోవటంపై, డిజిటల్, భౌతిక మౌలిక వసతులపై, మానవతా సంక్షోభాలను కలిసికట్టుగా ఎదుర్కోవటంపై ఆధారపడి ఉంటుంది’అని పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా సైనిక బలప్రయోగానికి పాల్పడుతూ ఆ ప్రాంత దేశాలపై బెదిరింపులకు దిగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఏషియాన్‌తో భారత్‌ది ఆర్థిక బంధం కాదు
ఏషియాన్ దేశాలతో భారత్‌కు ఉన్నది ఆర్థిక బంధం మాత్రమే కాదని, అంతకుమించి సైద్ధాంతిక అనుబంధమని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఏషియాన్ నాయకత్వంలో ఈ ప్రాంత సమగ్ర భద్రత కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. పరస్పర ప్రయోజనాలు కాపాడేందుకు ఏషియాన్‌తో భారత్ మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఏషియాన్ ప్లస్ దేశాలతో రక్షణ సహకారాన్ని భారత్ ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, సామర్థ్య పెంపు కోసమేనని భావిస్తోందని పేర్కొన్నారు. ఈ రక్షణ సహకారాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ‘భద్రత, వృద్ధి, స్వయం సమృద్ధిలో ఈ బలమైన అంతర్గత సంబంధం ఇండియా, ఏషియాన్ మధ్య నిజమైన భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది’అని తెలిపారు.


