లెబనాన్ రాజధాని బీరుట్ గగనతలంలో ఇటీవల భారీ ఎయిర్ ఫోర్స్ రద్దీ కనిపిస్తోంది. స్థానికులు వరుసగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాల కదలికలను గమనిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఏం జరుగబోతుందోనని లెబనాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లు సమాచారం.
ఎందుకీ ఆందోళన..?
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతుంది. సరిహద్దు నియంత్రణ, ప్రాంతీయ రాజకీయాల నేపథ్యంలో 1982లో ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. ఈ దాడికి వ్యతిరేకంగా లెబనాన్‌లో ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా హిజ్బుల్లా అనే సంస్థ ఏర్పడింది. హిజ్బుల్లా లెబనాన్‌లోని షియా ముస్లింలకు ఆధారంగా ఏర్పడి, ఇరాన్ మద్దతుతో బలపడింది. ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్‌లో శక్తివంతమైన రాజకీయ, సైనిక శక్తిగా మారింది.
ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో సైనిక ఉనికిని కొనసాగించడం, హిజ్బుల్లా దానిని ప్రతిఘటించడం ద్వారా వివాదం తీవ్రరూపం దాల్చింది. 2024 నవంబర్‌లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, అప్పుడప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి.
ఇటీవలే (డిసెంబర్ 9న) ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. మౌంట్ సఫీ, జ్బా, జెఫ్టా వ్యాలీ ప్రాంతాల్లో జనావాసాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి తమ గగనతలంలో సంచరిస్తుండటంతో లెబనాన్ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.


