Sagubadi: రైతమ్మల శ్రమకు జేజేలు! | Sagubadi: United Nations has officially launched the International Year of the Woman Farmer 2026 | Sakshi
Sakshi News home page

Sagubadi: రైతమ్మల శ్రమకు జేజేలు!

Dec 9 2025 12:56 AM | Updated on Dec 9 2025 12:56 AM

Sagubadi: United Nations has officially launched the International Year of the Woman Farmer 2026

వ్యవసాయం, ఆహార రంగ శ్రామికుల్లో 41% మంది మహిళలు

మహిళలు, బాలికల వేతనం లేని సంరక్షణ పని విలువ ఏటా 10.8 లక్షల కోట్ల డాలర్లు

లింగ వివక్షను రూపుమాపితే ప్రపంచ జీడీపీ ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెరుగుతుంది

4.5 కోట్ల మందిలో ఆహార అభద్రతను తగ్గించ వచ్చంటున్న ఎఫ్‌ఏఓ

2026ను ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించిన ఐక్యరాజ్యసమితి

వ్యవసాయం, ఆహారోత్పత్తుల తయారీ, పంపిణీ రంగాల్లో మహిళలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా శ్రమ తోడు లేకుండా వ్యవసాయం ఒక్క పూట కూడా ముందుకు సాగదు. ఆమె బహుపాత్రాభినయం చెయ్యకపోతే కుటుంబమూ వర్ధిల్లదు. పొలాల్లో వ్యవసాయ పనులు, ఇంటి దగ్గర పశుపోషణతో పాటు అదనంగా 
వంట పనులు, ఇంటి పనులు, పెద్దల సంరక్షణ పనులను భుజాన వేసుకొని మోస్తున్న మహిళా రైతులు కొవ్వొత్తుల్లా కరుగుతూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నారు. 

మహిళా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగపరమైన ప్రతిబంధకాలను, వివక్షలను, అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ లింగ అంతరాలను గుర్తించి, పరిష్కరిస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆహార అభ్రదత గణనీయంగా తగ్గుతుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆ దిశగా మీ ఆలోచనలు, ఆచరణకు పదును పెట్టండి అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం (ఐవైడబ్ల్యూఎఫ్‌ 2026)గా ప్రకటించింది. 

ఆహార భద్రతను అందించటంలో మహిళలు – రైతుగా, రైతు కూలీగా, ఆహార పరిశ్రమదారుగా, ఉద్యోగిగా, అమ్మగా, కుటుంబ సభ్యుల సంరక్షకురాలిగా– బహుముఖ సేవలందిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ శ్రామిక శక్తిలో మహిళలకు గణనీయమైన భాగస్వామ్యం ఉంది. వ్యవసాయ, ఆహార విలువ గొలుసులో వీరి పాత్ర అత్యంత కీలకం. 

వ్యవసాయంలో, వ్యవసాయానుబంధ రంగాల్లో ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్‌  పనుల నుంచి పంపిణీ, వాణిజ్య కార్యకలాపాల వరకు  వ్యవసాయ, ఆహార విలువ గొలుసు పరిధిలోకి వస్తాయి. ఇంటి ఆహార భద్రత, పోషకాహారం సమకూర్చటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021లో వ్యవసాయ ఆహార రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా శ్రమిస్తున్న వారిలో 41% మహిళలైనప్పటికీ, మహిళల శ్రమ విలువను తక్కువగా చూస్తున్నారు. నడుములు పడిపోయే శ్రమతో కూడుకున్న పనులు చేయిస్తారు. కానీ, తక్కువ జీతం. భూమి, ఆర్థిక, సాంకేతికత, విద్య, విస్తరణ సేవలు తదితర అన్ని స్థాయిల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో వ్యవస్థాగత అడ్డంకులను మహిళా రైతులు ఎదుర్కొంటున్నారు. 

మహిళా రైతుల జీవన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలను శక్తివంతం చేయడానికి.. తద్వారా వ్యవసాయాన్ని ఆహారోత్పత్తి రంగాలను మరింతగా ఒడిదుడుకుల్ని తట్టుకునేలా పటిష్టంగా నిర్మించడానికి అనుగుణంగా విధాన సంస్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌ఏఓతో పాటు ఐరాస అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐఎఫ్‌ఏడీ), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్లు్యఎఫ్‌పీ)లు వచ్చే ఏడాదంతా మహిళా రైతులను బలోపేతం చేసే కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి.  

‘మహిళా రైతు’లంటే ఎవరు?
వ్యవసాయ, ఆహార రంగాల్లో విభిన్న పాత్రల్లో పనిచేస్తున్న మహిళలందరూ మహిళా రైతులే. చిన్న/పెద్ద సొంత భూముల్లో పంటలు సాగు చేసే మహిళలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేపలు/రొయ్యల రైతులు, మత్స్యకారులు, చేపల కార్మికులు, తేనెటీగల పెంపకందారులు, పశువులు/కోళ్ల  పెంపకందారులు, ప్రాసెసర్లు, వ్యాపారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామీణ వ్యవస్థాపకులు, సాంప్రదాయ విజ్ఞానవంతులు.. అధికారిక లేదా అనధికారిక పనిలో నిమగ్నమయ్యే మహిళలు.. భూమి యాజమాన్య హక్కులు ఉన్నా లేకున్నా సరే.. వీరంతా మహిళా రైతులే. 

వీరిలో యువతులు, వృద్ధులు, పేద, ఆదివాసీ మహిళలు, వైకల్యాలున్న మహిళలు, శరణార్థులు, వలస వచ్చి వ్యవసాయ, ఆహార శుద్ధి పనులతో పొట్టపోసుకుంటున్న మహిళలు కూడా ఈ కోవలోని వారే.  వ్యవసాయ, ఆహార రంగాల్లో మహిళల స్థితిగతులు, లింగ అసమానతల స్థాయి, పర్యావరణ విపత్తుల నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల వల్ల కలుగుతున్న ప్రమాదాలను ఎఫ్‌ఏఓ నివేదికలు నొక్కి చెబుతున్నాయి. 

మీకు తెలుసా?
→ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో 2021లో పనిచేసే కార్మికుల్లో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతను ఎదుర్కొంటున్నారు.  

→ మగ రైతులతో పోల్చితే చాలా మంది మహిళా రైతులు చిన్న కమతాల్లోనే సేద్యం చేస్తున్నారు. 

→ వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంపాదన పురుషుల కన్నా 22% తక్కువ. 

→ మహిళా రైతులపై పొలం పనులతో పాటు ఇంటి సంరక్షణ పని భారం అధికంగా ఉంటుంది. ఇంటి పనులకు ప్రత్యేక ఆదాయం ఉండదు. అసలు ఆ శ్రమ విలువ లెక్కలోకి రాదు. పని చేసినా ఆర్థిక సాధికారత రాదు. వారి శారీరక, మానసిక శ్రేయస్సును ఈ వేతనం లేని పని భారం దెబ్బతీస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల కోసం చేసే వేతనం లేని సంరక్షణ పని విలువ ఏటా కనీసం 10.8 లక్షల కోట్ల డాలర్లని ఎఫ్‌ఏఓ లెక్కగట్టింది.

→ ప్రణాళికాబద్ధమైన పథకాల ద్వారా గ్రామీణ మహిళలను సాధికారపరిస్తే 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. 23.5 కోట్ల మందికి ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ ఈ దిశగా కృషి జరగటం లేదు. 

→ తీవ్రమైన వేడి, కరువుల నేపథ్యంలో పురుషుల కంటే మహిళలపై ఎక్కువ పని భారం పడుతుంది. 

→ లింగపరమైన అంతరాలను రూపుమాపితే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు పెరుగుతుంది. 4.5 కోట్ల మంది ఎదుర్కొంటున్న ఆహార అభద్రతను తగ్గించవచ్చు. 

→ ఆహార అభద్రత బాధితుల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. ఉపాధి, విద్యావకాశాలు, ఆదాయంలో లింగపరమైన అంతరం తగ్గించగలిగితే మహిళల్లో ఆహార అభద్రతను 52% తొలగించవచ్చని ఎఫ్‌ఏఓ నివేదిక తెలిపింది. 

→ మహిళలకు భూమి హక్కులు కల్పిస్తే వ్యవసాయ, ఆహార వ్యవస్థలు, గ్రామీణాభివృద్ధికి.. మొత్తంగా సమాజాభివృద్ధికి సహాయపడుతుంది. భూమి యాజమాన్య హక్కు విషయాల్లో లింగ వివక్ష రాజ్యం ఏలుతోంది. సాగు భూమిపై మహిళలకు మరింతగా హక్కులు కల్పిస్తే వారి సాధికారత, పెట్టుబడి సామర్థ్యం, స్థిరత్వం, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. భూమి హక్కున్న మహిళా రైతుకు సేవల లభ్యత మెరుగవుతుంది. లింగ ఆధారిత హింస తగ్గుతుందని ఎఫ్‌ఏఓ సూచిస్తోంది.
 

గడ్డిభూముల సంవత్సరం కూడా ! 
2026ను మహిళా రైతుల సంవత్సరంతో పాటు గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగానూ ఉమ్మడిగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. గడ్డి భూములు, సవన్నాలు, పొదలతో నిండిన బంజర్లు, ఎడారులు, చిత్తడి భూములు, కొండలు గుట్టలున్న ప్రాంతాల విస్తీర్ణం భూతలమ్మీద సగానికి సగం ఉంటుంది. ఈ ప్రాంతాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించటం జీవవైవిధ్యం, పచ్చదనం పరిరక్షణకు, కర్బన నిల్వలు, నీటి చక్రం నిర్వహణకు అవసరం. 

గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు వంటి సుమారు 100 కోట్ల పశువులను బంజరు భూములు, పచ్చికబయళ్లలో మేపుకుంటూ ఎంతో మంది సంచార పశుకాపరులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూముల్లో దాగి ఉన్న కర్బన నిల్వల్లో 30% ఈ భూముల్లోనే ఉంది. భూతాపం పెరగటం వల్ల ఈ భూముల్లోని సగం కర్బనం వాతావరణంలో కలిసినట్లు అంచనాలు ఉన్నాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి ఉన్న ప్రజల జీవనోపాధులు ప్రమాదంలో పడుతున్నాయి. గడ్డి భూములు, చిత్తడి నేలల పరిరక్షణకు పాలకులు శ్రద్ధతీసుకొని పెట్టుబడులు పెట్టాలని ఎఫ్‌ఏఓ పిలుపునిచ్చింది. ఈ భూములను పరిరక్షించటం ద్వారా పంట పొలాలకూ మేలు జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement