లక్నో: ఇజ్రాయెల్–హమాస్, ఉక్రెయిన్– రష్యా వంటి సంక్షోభాలతోపాటు మానవీయ విపత్తులు వంటివి తలెత్తినప్పుడు ఐక్యరాజ్యసమితి మరింత సమర్థవంతమైన పాత్ర పోషించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నొక్కి చెప్పారు. నూతన ప్రపంచానికి, నూతన ఐక్యరాజ్యసమితి, నూతన అంతర్జాతీయ క్రమత అవసరముందని ఆయన పేర్కొన్నారు.
సిటీ మాంటెస్సోరి స్కూల్ నిర్వహించిన ప్రపంచ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షోభాలతో నిండిన నేటి ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి కీలకంగా వ్యవహరించలేకపోతోందని ఆయన తెలిపారు. అగ్ర రాజ్యాల పలుకుబడి, ప్రపంచ సంక్లిష్ట రాజకీయాల కారణంగా ఐరాస అంతగా రాణించడం లేదని చెప్పారు. ఈ సంస్థ ఉనికే ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నూతన ఐరాస అంటే కొత్తగా మరో సంస్థను ఏర్పాటు చేయడం కాదు, నూతన శక్తిని సంతరించుకున్న ఐక్యరాజ్యసమితి అని ఆయన వివరించారు.


