పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ప్రకటన నేపథ్యంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి ఆదివారం కావడంతో ఆ తేదీ మారవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
దేశవ్యాప్తంగా యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తి నెలకొంది. 2017 నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది కేంద్రం. కానీ, ఈసారి ఒకటో తేదీ ఆదివారం వచ్చింది. సాధారణంగా వారాంతాల్లో పార్లమెంట్ సమావేశాలే జరగవు. బ్రిటీష్ కాలం నుంచే ఆదివారాలను తప్పించాలనే ఆచారం కొనసాగేది. అలాంటిది.. అందునా ఆదివారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫిబ్రవరి 1నే కొనసాగిస్తారా? లేదంటే ఫిబ్రవరి 2 (సోమవారం)కి మార్చుతారా? అంటూ చర్చ మొదలైంది. అయితే.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాత్రం.. తుది నిర్ణయం కేబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో.. ఆదివారం నిర్వహించడంపై సందేహాలు కొనసాగుతున్నాయి.
అలాగని వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్త విషయమేమీ కాదు. 2025లోనూ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో.. అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు 2015లో శనివారం, 2016లో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2020లో కోవిడ్ సమయంలో.. అలాగే 2012 మే 13వ తేదీన 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సమావేశమైంది కూడా. దీంతో ఈసారి కూడా ఆదివారమే బడ్జెట్ ప్రవేశపెట్టే అస్కారం లేకపోలేదు.
ఫిబ్రవరి 1నే ఎందుకంటే..
2017 ఏడాదికి ముందు బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టబడేది. అయితే.. బడ్జెట్ ప్రవేశపెట్టాక మొదటి త్రైమాసిక ఖర్చుల కోసం ‘వోట్ ఆన్ అకౌంట్’ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత విభాగాల వారీగా డిమాండ్లను పరిశీలించి పూర్తి బడ్జెట్ ఆమోదించబడేది.ఈ ఆలస్యాన్ని నివారించేందుకు 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీంతో ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం లభించింది.


