‘సిందూర్’లో రాముడి ఆశయాలు పాటించాం
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవం
అయోధ్య: దేశంలో రామ జన్మభూమి ఉద్యమం ఒక మహోన్నత గాథ అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఈ ఉద్యమం భవిష్యత్తుకు పునాది వేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శ్రీరాముడి ఆశయాల మేరకు మన దేశం నడుచుకున్నట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం భవ్య రామమందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
గర్భాలయంలో బాల రాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ మందిరం ప్రాంగణంలోని అన్నపూర్ణ ఆలయంపై ధ్వజారోహణ గావించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ సనాతన సంప్రదాయాలను అంతం చేయడానికి విదేశీ దురాక్రమణదారులు ఎన్నో కుట్రలు సాగించారని చెప్పారు. అయినప్పటికీ నేడు రామ మందిరంపై కాషాయ ధ్వజం సగర్వంగా రెపరెపలాడుతూ నాగరికత కొనసాగింపు సందేశాన్ని ఇస్తోందని హర్షం వ్యక్తంచేశారు.
వినమ్రతకు, మంచితనానికి మారుపేరైన శ్రీరాముడు అవసరమైతే దుషు్టలను అంతం చేయడానికి ఉగ్రరూపం కూడా దాలుస్తాడని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో రాముడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లామని స్పష్టంచేశారు. రాముడి అసలు లక్ష్యం రావణుడిని అంతం చేయడం కాదని.. అధర్మాన్ని నిర్మూలించడమేనని అన్నారు. అదే తరహాలో ఉగ్రవాదులకు, వారి పోషకులకు బుద్ధి చెప్పడమే మన ధ్యేయమని వెల్లడించారు. ఆధునిక భారతదేశం సంఘర్షణల్లోనూ ‘మర్యాద’కు కట్టుబడి ఉంటుందన్నారు. అయోధ్యలో రాముడు కొలువుదీరడం కళ్లారా చూస్తున్నామని, అది మనకు గొప్ప సంతృప్తి ఇస్తోందని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
దశాబ్దంలో అయోధ్యలో పెనుమార్పులు: యోగి
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత దశాబ్దకాలంలో అయోధ్యలో పెనుమార్పులు వచ్చా యని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చె ప్పారు. గతంలో కొందరు వ్యక్తులు, మతోన్మాదు లు అయోధ్యను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. రామమందిర ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు.
రామ జన్మభూమి ఉద్యమంలో రాజ్‌నాథ్ సింగ్ చురుకైన పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. 500 ఏళ్ల తర్వాత రామ మందిరం సాకారం కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని పేర్కొన్నారు. నగరానికి గతంలో తరచుగా ఉగ్రవాద బెదిరింపులు వచ్చేవని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం పూర్తి సురక్షితంగా మారిందన్నారు. గత ఐదేళ్లలో 45 కోట్ల మంది భక్తులను అయోధ్యను దర్శించుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
మన విశ్వాసం, సంప్రదాయాల వేడుక: మోదీ
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మన విశ్వాసం, సంప్రదాయాల మహోన్నత దైవిక వేడుక అని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశ విదేశాల్లోనికోట్లాది మంది రామ భక్తుల తరఫున అయోధ్య రాముడి పాదపద్మాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నట్లు ఉద్ఘాటించారు.
రాముడి ఆశీస్సులతో ప్రజలకు శుభాలు చేకూరాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఐదు శతాబ్దాల ప్రజల సంకల్పం రెండు సంవత్సరాల క్రితం నెరవేరిందని వివరించారు. రామ్‌లల్లా ప్రతిష్ట ద్వాదశికి ఆలయంపైనున్న ధర్మధ్వజం ఒక ప్రతీకగా నిలుస్తోందన్నారు. గత నెలలో జరిగిన ధర్మధ్వజ వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హృదయం సేవ, అంకితభావం, కరుణ అనే భావనలతో నిండిపోవాలని, స్వయం సమృద్ధ భారత్‌కు అదే పునాది అని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు.


