లక్నో: అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితుడైన సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపారు. నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో నిమ్నవర్గాలను (శూద్రులను) హీనంగా చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారాయన. ఈ నేపథ్యంలో యాదవులు హిందువులు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యాదవ్ సమాజం హిందువులలో భాగం కాదని పేర్కొంటూ.. మనుస్మృతిలోని కుల విభజనను ప్రశ్నించారు. మనిషిని కుక్క కంటే హీనంగా చూసే మతాన్ని తాను అనుసరించనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సిర్సాగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దండియామాయి గ్రామంలో "పీడీఏ (దళిత్-వెనుకబడిన-మైనారిటీ) పాఠశాల" పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
నేను మనిషిని..
"మేము బ్రాహ్మణులం కాదు. మేము క్షత్రియులం కాదు. మేము వైశ్యులం కూడా కాదు. ఇక మిగిలింది ఎవరు? శూద్రులు. నేను మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. హిందువుగా ఉండటం తప్పనిసరి కాదు. ప్రతి వేదికపై చెప్పినట్లే, ఇక్కడా చెబుతున్నా.. నేను హిందువును కాదు. నా పేరు శివరాజ్ సింగ్ యాదవ్, నేను ఒక మనిషిని. హిందువును కాదు. ఎందుకంటే ఏ మతమైతే మనిషిని కుక్క కంటే హీనంగా చూస్తుందో, ఆ మతాన్ని అస్సలు పాటించను, ఎప్పటికీ అనుసరించన''ని శివరాజ్ సింగ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై అత్యంత దారుణమైన అకృత్యాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.
పీడితులకు రాజ్యాధికారమే లక్ష్యంగా..
నిమ్నవర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టాలన్న లక్ష్యంతో పీడీఏ భావనను వ్యాప్తి చేస్తున్నామని శివరాజ్ సింగ్ యాదవ్ (Shivraj Singh Yadav) వివరించారు. దళిత- వెనుకబడిన- మైనారిటీ వర్గాలు దేశ జనాభాలో దాదాపు 90 శాతం ఉన్నప్పటికీ రాజ్యాధికారంలో తగినంత ప్రాతినిథ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో వివక్షకు గురైన దళితులు ఎక్కువగా ఆ మతాన్ని విడిచిపెట్టారని తెలిపారు. వీరిలో చాలా మంది బౌద్ధమతంలోని సమతావాదానికి ఆకర్షితులై అందులో చేరారని అన్నారు. తమ కులానికి చెందిన కొద్దిమంది యాదవ్ నాయకులు మాత్రమే తాము హిందువులు కాదని ప్రకటించుకున్నారని చెప్పారు.
చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?
కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చాక యూపీతో పాటు కేంద్రంలోనూ పీడిత వర్గాలపై దాడులు పెరిగాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) చాలా సందర్భాల్లో విమర్శించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం.. దళిత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నాయని పలుమార్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌కు సన్నిహితుడైన శివరాజ్ సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వెనుకబడిన వర్గాలు, దళిత, మైనారిటీల ఓట్ల కోసమే ఆయనీ వ్యాఖ్యలు చేశారని అధికార వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి.


