డీఆర్‌డీఓ పనితీరు ప్రశంసనీయం | DRDO Weapon Systems Key During Operation Sindoor, Says Rajnath Singh | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఓ పనితీరు ప్రశంసనీయం

Jan 2 2026 6:33 AM | Updated on Jan 2 2026 6:33 AM

DRDO Weapon Systems Key During Operation Sindoor, Says Rajnath Singh

‘సుదర్శన్‌ చక్ర’ తయారీలో సంస్థ పాత్ర కీలకం  

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌ఈఓ) అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు ఆపరేషన్‌ సిందూర్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడే విషయంలో డీఆర్‌డీఓ అంకితభావం, వృత్తి నిబద్ధతకు ఇదొక ప్రతీక అని ఉద్ఘాటించారు. డీఆర్‌డీఓ 68వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ఢిల్లీలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ భద్రతా కవచమైన ‘సుదర్శన చక్ర’ తయారీ వెనుక డీఆర్‌డీఓ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 

సుదర్శన చక్ర మిషన్‌ పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు. త్వరలోనే ఈ రక్షణ కవచం మనకు అందుబాటులోకి వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. 2025లో ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘మిషన్‌ సుదర్శన్‌ చక్ర’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా గగనతల రక్షణ కోసం బలమైన వ్యవస్థను డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక యుద్ధాల్లో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ చాలా కీలకమన్న సంగతిని ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో అందరూ గుర్తించినట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. 

ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి 
డీఆర్‌డీఓను 1958లో ఏర్పాటు చేశారు. అప్పటికే పనిచేస్తున్న టీడీఈలు, డీటీడీపీ, డీఎస్‌ఓను కలిపేసి ఒకే సంస్థగా నెలకొల్పారు. మొదటి 10 ల్యాబ్‌లో ప్రారంభమైన డీఆర్‌డీఓ క్రమంగా ఇంతింతై అన్నట్లుగా ఎదిగింది. ప్రపంచంలో అతిపెద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. భారత సైన్యానికి అవసరమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. కాలానుగుణంగా అత్యాధునిక ఆయుధాలను అందిస్తోంది. వేగంగా మారిపోతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లాలని డీఆర్‌డీఓకు రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. నవీన ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు. అదే సమయంలో రక్షణ పరిశోధనల్లో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

సైంటిస్టులు, సిబ్బందికి శుభాకాంక్షలు 
డీఆర్‌డీఓ తయారు చేసిన ఆయుధాలు ఆపరేషన్‌ సిందూర్‌లో అద్భుతంగా పనిచేశా యని, సైనికుల ఆత్మస్థైర్యం పెంచాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. ఆధునిక టెక్నాలజీ, ఆయుధాలతో సైన్యానికి స్వదేశీ శక్తిని సమకూరుస్తోందని చెప్పారు. డీఆర్‌డీఓ విశ్వసనీయ సంస్థగా మారిందన్నారు. స్టార్టప్‌ లు, ఎంఎస్‌ఎంఈలతో కలిసి పనిచేయాలని సూచించారు. డీఆర్‌డీఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఆర్‌అండ్‌డీ కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మన్‌ సమీర్‌ వి.కామత్‌ తదితరులు పాల్గొన్నారు. 2025లో సంస్థ సాధించిన విజయాలు, ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమాల గురించి అధికారులు రాజ్‌నాథ్‌ సింగ్‌కు వివరించారు. అనంతరం డీఆర్‌డీఓ సైంటిస్టులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు వారు చేయూత ఇస్తున్నారని, అంకితభావంతో పని చేస్తున్నారని ఉద్ఘాటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement