తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస | Malayalam actress inspiring legal battle | Sakshi
Sakshi News home page

తీర్పు ఏదైనా...పోరుకు ప్రశంస

Dec 9 2025 12:34 AM | Updated on Dec 9 2025 12:34 AM

Malayalam actress inspiring legal battle

న్యూస్‌మేకర్‌

శక్తిమంతులతో పోరాడే సమయంలో పోరాటమే విజయంతో సమానం. ఆ తర్వాత దక్కిన న్యాయం సంతృప్తిని ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. కేరళ సూపర్‌స్టార్‌ దిలీప్‌ తనపై అత్యాచారం చేసేందుకు ఒక  గ్యాంగ్‌తో కుట్ర పన్నాడని ఆరోపించి సుదీర్ఘకాలం పోరాడిన నటి (తెలుగులో కూడా నటించింది) చివరకు డిసెంబర్‌ 8న జడ్జిమెంట్‌ 
వినగలిగింది. 

మొత్తం 15 మంది నిందితులున్న ఈ కేసులో 1 నుంచి 6 వరకు ఉన్న నిందితులను కోర్టు దోషులుగా ఖరారు చేసి 8వ నిందితుడైన దిలీప్‌ను  నిర్దోషిగా విడుదల చేసింది. దీనిపై వ్యాఖ్యలు వినిపిస్తున్నా కేరళను కంపింప చేసి ఎన్నో సవాళ్లు తట్టుకుని పోరాడిన నటిని ముందు ప్రశంసించాల్సి ఉంది.

తాను పని చేసే రంగంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని ఒక బాధితురాలు విశ్వసిస్తే ఆమె చేసే పోరాటానికి ఎన్ని అవరోధాలు ఉంటాయి? మలయాళ సూపర్‌స్టార్‌ దిలీప్‌ పన్నిన కుట్ర వల్లే తన మీద అత్యాచారం జరిగిందని న్యాయపోరాటానికి దిగిన మలయాళ నటి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని చివరకు ‘తీర్పు’ను సాధించింది. అయితే ఆ తీర్పులో తనకు దక్కిన న్యాయం పాక్షికమా? సంపూర్ణమా అనేది చర్చే అయినా... ఇంతవరకూ ఆమె వెరవక నిలబడటం చాలా గొప్ప సంగతి. స్ఫూర్తిదాయకమైన పోరాటం.

→ అసలేం జరిగింది?
మలయాళ నటి ‘ఎం’ (కథనం కోసం పెట్టిన పేరు) ఫిబ్రవరి 17, 2017న త్రిషూర్‌లోని తన ఇంటి నుంచి కొచ్చి వెళుతున్నప్పుడు రాత్రి వేళ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనంతో ఢీకొట్టిన కొంతమంది ఆమె వాహనంలోకి జొరపడ్డారు. ఆ తర్వాత కొచ్చి అంతా తిప్పుతూ ‘ఎం’ను దుర్బాష లాడారు. వారిలో పల్సన్‌ సుని అనే పాత నేరస్తుడు ఆమె మీద అత్యాచారం చేయడమే కాదు అదంతా వీడియో తీశాడు. ఆ తర్వాత ఒక దర్శకుడి ఇంటి ముందు ఆమెను పడేసి ఉడాయించాడు. దర్శకుడి సహాయంతో అదే రోజు ‘ఎం’ కేసు నమోదు చేసింది.

→ తర్వాత ఏం జరిగింది?
మొదట పోలీసులు ఇదో బ్లాక్‌మెయిల్‌ దందా చేసే వారి పని అని భావించారు. అయితే అత్యాచార సమయంలో పల్సర్‌ సుని ‘ఎం’తో ‘నేను కొటేషన్‌ అందుకోవడం వల్లే ఈ పని చేస్తున్నాను’ అన్నాడు. కొటేషన్‌ అంటే సుపారీ. అయితే ఈ సుపారీ సంగతి వెంటనే పోలీసుల దృష్టికి రాలేదు. బాధితురాలు ఇది కీలకమైన కామెంట్‌గా గమనించలేదు.

→ అరెస్టులు
పోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. వీరిలో పల్సర్‌ సునితో పాటు ‘ఎం’ వాహన డ్రైవర్‌ ఇంకా ఆరు గురు ఉన్నారు. మే 1, 2017 నాటికి ‘ది విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ పేరుతో మలయాళ నటీమణులు ఒక బృందంగా ఏర్పడి ముఖ్యమంత్రిని కలిసి మలయాళ పరిశ్రమలో సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ గురించి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. 

జూన్, 2017 నాటికి విష్ణు అనే వ్యక్తి తాను పల్సర్‌ సునీ జైల్‌మేట్‌నని జైలులో అతడు ఈ కేసు వెనుక నటుడు దిలీప్‌ ఉన్నాడన్న సంగతి చెప్పాడని బయటకు వెల్లడి చేయడంతో గగ్గోలు మొదలైంది. మరోవైపు ‘కొటేషన్‌ డబ్బు బేలెన్స్‌ చెల్లించమని’ పల్సర్‌ సుని రాసినట్టుగా చెప్పే లెటర్‌ బయటకు ‘లీక్‌ అయ్యింది’. దాంతో ఈ అత్యాచారం కుట్రలో దిలీప్‌ ఉన్నాడన్న విషయం బయటకు వచ్చి కేరళలో కంపనలు పుట్టాయి. జనం రెండుగా చీలి వాదులాడుకున్నారు. ‘ఎం’ను దుర్బాషలాడారు. జూన్‌ 24, 2017న దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

→ దిలీప్‌పై ఆరోపణ ఎందుకు?
నటుడు దిలీప్, నటి మంజు వారియర్‌ 2012లో వివాహం చేసుకున్నారు. అయితే దిలీప్‌కు మరో నటి కావ్య మాధవన్‌తో సంబంధం ఉన్నట్టు మంజుకు అనుమానం వచ్చింది. కాని ఏ ఆధారం దొరకలేదు. అయితే దిలీప్‌కు, కావ్యా మాధవన్‌కు ఉమ్మడి స్నేహితురాలైన ‘ఎం’కు ఈ విషయం తెలిసి ఉండొచ్చనే ఉద్దేశంతో మంజు ‘ఎం’ను నిలదీసింది. ‘ఎం’ ఆ సంబంధాన్ని బయట పెట్టిందని సమాచారం. తనకు స్నేహితురాలిగా ఉంటూ తన పెళ్లిలో చిచ్చు పెట్టిన ‘ఎం’ మీద ఆనాటి నుంచి కోపం పెట్టుకున్న దిలీప్‌ సమయం కోసం ఎదురు చూశాడని ఆరోపణ. 

ఈలోపు 2015లో మంజు, దిలీప్‌లు విడాకులు తీసుకున్నారు. 2016లో దిలీప్, కావ్య వివాహం చేసుకున్నారు. 2017లో ‘ఎం’ మరికొన్ని రోజుల్లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోనున్నదనగా ఈ ఘటన జరిగింది. ఈ పూర్వరంగం అంతా ‘ఎం’ను దిలీప్‌ దీని వెనుక ఉన్నాడని విశ్వసించేలా చేసింది. అయితే దిలీప్‌ ముందు నుంచీ ఇదంతా తన ప్రతిష్టను తట్టుకోలేని శక్తులు చేసిన కుట్రగా కొట్టేస్తూ వచ్చాడు. 84 రోజులు జైలులో ఉండి బయటకు వచ్చిన దిలీప్‌ తనే ఈ కేసులో సి.బి.ఐ. విచారణ జరిపించాలని సుప్రీం కోర్టు వరకూ వెళ్లాడు.

→ 2018లో విచారణ మొదలు
ఎర్నాకుళం ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో హనీ ఎం.వర్గీస్‌ అనే మహిళా న్యాయమూర్తి నేతృత్వంలో 2018లో విచారణ మొదలైంది. అయితే ఈ జడ్జి మీద తనకు విశ్వాసం లేదని బాధిత నటి కేరళ హైకోర్టు కూ, సుప్రింకోర్టుకూ వెళ్లి న్యాయమూర్తిని మార్చమని అభ్యర్థించింది. అయితే న్యాయమూర్తి మార్పు జరగలేదు. విచారణలో స్వచ్ఛతపై అసంతృప్తితో 2022 నాటికి ఇద్దరు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఒకరి తర్వాత ఒకరుగా కేసు నుంచి తప్పుకున్నారు. చాలా మంది సాక్షులు మొదట బాధితురాలి పక్షాన స్టేట్‌మెంట్స్‌ ఇచ్చి కాలక్రమంలో అడ్డం తిరిగారు. 

సత్వర విచార జరగాల్సిన కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్లింది. దిలీప్‌ ఉపయోగించిన ఫోన్లు, ఇతర ఫోన్లు ‘టాంపర్‌’ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అత్యాచార దృశ్యాలు చిత్రీకరించిన ఫోను ‘మాయమైంది’. వీటన్నింటి మధ్య కేసు నత్తనడక నడవగా స్వయంగా సుప్రిం కోర్టు రంగంలో దిగి కేసును తొందరగా ముగించమని హెచ్చరించాల్సి వచ్చింది. చివరకు 2022లో ‘ఎం’ తనకు తానే బయటకు వచ్చి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకుంది. కేరళ ప్రభుత్వం విధించిన హేమ కమిటీ మలయాళ పరిశ్రమలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలను బయటకు వెల్లడి చేయడంతో మరో దుమారం లేచింది. 

ఇవన్నీ అయ్యాక తుదకు డిసెంబర్‌ 8, 2025న తీర్పు వెలువడింది. ఇందులో ఆరుగురు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది. 7 నుంచి 15 వరకూ ఉన్న నిందితులను వదిలిపెట్టింది. 8వ నిందితుడైన దిలీప్‌కు ప్రస్తుతానికి విముక్తి దొరికింది. అయితే దీని మీద విస్తృతంగా వ్యాఖ్యలు, విమర్శలు వినపడుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఈ తీర్పును చాలెంజ్‌ చేస్తామని చెప్పింది. బాధిత ‘ఎం’ కూడా పై కోర్టుకు వెళ్లవచ్చు. తదుపరి పరిణామాలు ఎలా ఉన్నా బలవంతులపై బాధిత మహిళల పోరాటం ఆగవలసిన అవసరం లేదని ‘ఎం’ నిరూపించింది. ఆమె స్థయిర్యం వల్లే ఇంతవరకైనా వచ్చింది. ఇక మీదట ఆమె చేయబోయే పోరాటం మరో తీర్పును ప్రసాదించవచ్చు. వేచి చూద్దాం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement