వాటర్ బాటిల్ ధర ఎక్కువ అన‍్నందుకు దుకాణుదారు దాడి
గాజుసీసాతో దాడి చేయడంతో తలకు రక్తగాయం
అంతటితో ఆగకుండా దీక్షామాలను తెంచేసిన వ్యాపారి
విషయం తెలుసుకుని, ఘటనాస్థలికి చేరుకున్న తెలుగుభక్తులు
పళని రహదారిపై ఆందోళన.. రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు.. కేసు నమోదు
పళని(తమిళనాడు): శబరిమలో యాత్రలో భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి జరిగిన ఉదంతమిది. తోటి అయ్యప్పలు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తూ.. మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి క్షేత్రానికి చేరుకుంది.
ఈ క్రమంలో ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలుకు వెళ్లారు. గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్‌పీ) రూ.30గా ఉండగా.. దుకాణుదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని భక్తుడు నిలదీయగా.. తమిళంలో తిట్ల పర్వం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా.. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగని సదరు వ్యాపారి, బాధిత భక్తుడి మెడలోని అయ్యప్ప దీక్షామాలను తెంచేశాడు.
ఈ సమాచారం అందుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరుగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయ్యప్ప భక్తుడిపై దాడి చేసిన దుకాణుదారుడిని నిలదీశారు. ఈ క్రమంలో స్థానికులు ఆ వ్యాపారికి అండగా నిలిచి, వాగ్వాదానికి దిగారు. చూస్తుండగానే తెలుగు భక్తులు పెరిగిపోయారు. ఆ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే ఆందోళన నిర్వహించారు.
తమ ఆందోళనపై స్పందన లేకపోవడంతో.. రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఓ దశలో వ్యాపారికి సపోర్ట్ చేస్తూ.. తెలుగు భక్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో.. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


