ఎస్‌ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని ఇవ్వండి
రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో పాల్గొనే బూత్ లెవల్ అధికారు(బీఎల్‌వో)లపై పని ఒత్తిడి తగ్గించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వారిపై పనిభారం తగ్గించేందుకు వీలుగా మరింత మంది సిబ్బందిని కేటాయించాలని సంబంధిత రాష్ట్రాలను ఆదేశించింది.
ఎస్‌ఐఆర్‌ను గడువులోగా పూర్తి చేయాలంటూ బీఎల్‌వోలపై ఈసీ ఒత్తిడి పెంచుతోందని, అలా చేయని వారిపై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకుంటోందని, ఈ పరిస్థితుల్లో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయని నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) సుప్రీంలో పిటిషన్ వేసింది.
దీనిని గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగి్చల ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఎల్‌వోలుగా విధులు నిర్వర్తిస్తున్న టీచర్లు, అంగన్ వాడీ సిబ్బంది వంటి వారిపై ఒత్తిడి చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఆపేలా ఈసీని ఆదేశించాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకరనారాయణన్ కోరారు. ‘రాష్ట్రాలు ఎస్‌ఐఆర్ కోసం ఈసీకి అదనంగా సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుంది. పనిగంటలు తగ్గి, బీఎల్‌వోలపై ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బందులుంటే రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి.
ఎస్‌ఐఆర్ జరుగుతున్న రాష్ట్రాలు అవసరమైన మేరకు అదనంగా సిబ్బందిని నియమించుకోవాలి’అని ధర్మాసనం పేర్కొంది. ‘సిబ్బంది ఎవరైనా ప్రత్యేక కారణాలతో మినహాయింపు కోరిన పక్షంలో సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారి అలాంటి కేసులను పరిస్థితులను బట్టి డీల్ చేయాలి. వేరొకరిని ఆస్థానంలో నియమించాలి’అని ధర్మాసనం వివరించింది. అలా ప్రత్యామ్నాయం ఇవ్వలేనప్పుడు, ఆ ఉద్యోగిని బాధ్యతల నుంచి ఉపసంహరించుకోవాలనడం తమ ఉద్దేశం కాదని కూడా ధర్మాసనం స్పష్టతనిచి్చంది. విధుల్లో మరణించిన బీఎల్‌వోల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం వంటి అంశాలపై తర్వాత వేరుగా ఆదేశాలిస్తామని తెలిపింది.


