లక్నో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే సమయంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరోపణలపై దేశంలోనే మొదటిసారిగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కుటుంబంపై కేసు నమోదైంది. రాంపూర్ జిల్లాకు చెందిన నూర్జహాన్ ఇద్దరు కుమారులు ఆమిర్ ఖాన్, డానిష్ ఖాన్ దుబాయ్, కువాయిట్‌లలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు.
అయితే, నూర్జహాన్ ఎస్‌ఐఆర్ బూత్ లెవల్ అధికారులకు వాళ్లిద్దరూ రాంపూర్‌లోని జ్వాలా నగర్‌లోనే ఉంటున్నట్లు ఫోర్జరీ పత్రాలను ఎన్యుమరేషన్ సందర్భంగా సమర్పించింది. డిజిటైజేషన్ ఫాంలను పరిశీలించిన బీఎల్‌వోల ఈ విషయాన్ని గుర్తించారు. ఆరా తీయగా వారిద్దరూ విదేశాల్లో ఉంటున్నది నిజమేనని తేలింది. దీంతో, నిజాలను దాచిపెట్టినందుకు నూర్జహాన్, ఆమె ఇద్దరు కుమారులపై ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 31 కింద, బీఎన్‌ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేది చెప్పారు.


