ఎయిర్ ఇండియాలో సితార్ ధ్వంసం
అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన
సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తన సితార్ ధ్వంసం కావడంపై అంతర్జాతీయ సంగీతకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో తన ప్రియమైన సితార్ ధ్వంసం కావడంతో ఆమె భగ్గుమన్నారు. ‘ఒక భారతీయ వాయిద్యానికి కూడా ఈ దేశపు విమాన సంస్థలో భద్రత లేదా?’.. అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. పదిహేనేళ్ల తన కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆమె స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆమె బుధవారం, తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సంగీత ప్రియులను కలచివేసింది. విలువైన సితార్ దిగువ భాగంలో ఏర్పడిన లోతైన
పగులును ఆమె చూపించారు. ‘నా సితార్ శృతి తప్పిందేమోనని ముందు భావించాను. వాయించడానికి తీసుకున్నప్పుడే ఈ దారుణం తెలిసింది’.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చాలా కాలం తర్వాత ఎయిర్ ఇండియాను ఎంచుకున్నాను. నా వాయిద్యానికే ఇలా ఎందుకు జరిగింది? ప్రత్యేక హార్డ్–కేసులు ఉన్నా, హ్యాండ్లింగ్ రుసుములు వసూలు చేసినా ఇంత దారుణమైన నిర్లక్ష్యమా?’.. అని ఆమె నిలదీశారు.
పరిశీలిస్తున్నామన్న ఎయిర్ ఇండియా
అనౌష్క తన విమాన వివరాలను, ఎక్కడ దిగారనేది చెప్పనప్పటికీ, ఎయిర్ ఇండియా ప్రతినిధి గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా అతిథి అనుభవించిన బాధకు చింతిస్తున్నాం. ఈ వాయిద్యం సాంస్కృతిక ప్రాధాన్యం మాకు తెలుసు’.. అని పేర్కొన్నారు. నష్టానికి గల కారణాలను నిర్ధారించలేకపోతున్నామని చెప్పిన సంస్థ, ఢిల్లీ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీతో సహా సమగ్ర విచారణ ప్రారంభించినట్లు తెలిపింది.
భారత్ పర్యటనకు ముందే..
జనవరి 30న హైదరాబాద్‌తో ప్రారంభం కానున్న తన భారత పర్యటనకు అనౌష్క శంకర్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలువురు కళాకారుల్ని కలచివేసింది. ఈ సంఘటన హృదయ విదారకమని ప్రముఖ కళాకారులు జాకిర్ ఖాన్, విశాల్ దడ్లాని పేర్కొన్నారు. గాయకుడు పాపోన్ స్పందిస్తూ, ‘ఈ రోజుల్లో శ్రద్ధ కరువైంది. అసలు శ్రద్ధ అనే భావమే కనుమరుగైందేమో! ఇది విచారకరం’.. అంటూ ఎయిర్ ఇండియా తీరుపై మండిపడ్డారు. గతంలోనూ ప్రయాణ సమస్యలు 44 ఏళ్ల శంకర్ గత ఏడాది కూడా ప్రయాణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన యూరోపియన్ టూర్ చివరి షో కోసం బెర్లిన్‌లో ఉన్నప్పుడు, దుస్తులు, వాయిద్యానికి అవసరమైన ’మిజ్రాబ్స్’ (వేళ్లకు ధరించే ఫిక్సŠడ్ పికర్స్) ఉన్న లగేజీని పోగొట్టుకున్నారు.
పదేపదే తప్పిదాలా?
సంగీత కళాకారులకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. 2010లో సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వాయిద్యం ఎయిర్ ఇండియాలో దెబ్బతినగా, 2019లో పండిట్ శుభేంద్ర రావు సితార్ కూడా ఈ సంస్థ విమానంలోనే దెబ్బ తింది. తాజా ఘటనతో, విమానయాన సంస్థలు కళాకారుల విలువైన వాయిద్యాల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది.


