అనంతపురం జిల్లా శింగనమల దుర్గాంజనేయస్వామి పూజారిపై టీడీపీ నేతల బూతుపురాణం
అవమానం భరించలేక ఆమరణ నిరాహార దీక్ష
సోషల్ మీడియాలో పూజారి ఆవేదన వీడియో వైరల్
శింగనమల: సామాన్య ప్రజలతోపాటు చిన్నారులు విద్యను అభ్యసించే బడిలోను.. దైవం కొలువైన గుడిలోను కూడా అధికార మదంతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద కొలువైన దుర్గాంజనేయస్వామి ఆలయ పూజారిపై పచ్చ పైత్యంతో బూతుపురాణం విప్పి మరీ రెచ్చిపోయారు. పూజారిని ఇష్టానుసారం దూషించటంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజారి తన ఆవేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
టీడీపీ నేతలు చేసిన అవమానం భరించలేక ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. శింగనమల చెరువుకట్ట వద్ద ఉన్న దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారిగా రమణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక టీడీపీకి చెందిన కొందరు ఆలయంపై ఆధిపత్యం కోసం పూజారి రమణను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు వచ్చి పూజ చేయాలని కోరారు.
సాయంత్రం చేస్తానని పూజారి చెప్పగా.. వారు అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో పూజారి రమణ తన ఆవేదనను వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఏడాది నుంచి తమను ఆలయం నుంచి పంపించివేసేందుకు టీడీపీకి చెందిన వ్యక్తులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, అందులో భాగంగానే కొంతమంది వచ్చి బెదిరించారని వాపోయారు.
తరచూ కొందరు రావడం.. ఆలయం వదిలి పోవాలని ఒత్తిడి చేయడం పరిపాటిగా మారిందన్నారు. కాగా.. పూజారి డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలు ఆలయం వద్దకు చేరుకున్నారు. పూజారితో వాదించడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు.


