breaking news
Sitar
-
నా గుండె పగిలింది
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో తన సితార్ ధ్వంసం కావడంపై అంతర్జాతీయ సంగీతకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విమానంలో తన ప్రియమైన సితార్ ధ్వంసం కావడంతో ఆమె భగ్గుమన్నారు. ‘ఒక భారతీయ వాయిద్యానికి కూడా ఈ దేశపు విమాన సంస్థలో భద్రత లేదా?’.. అంటూ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. పదిహేనేళ్ల తన కెరీర్లో ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె బుధవారం, తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సంగీత ప్రియులను కలచివేసింది. విలువైన సితార్ దిగువ భాగంలో ఏర్పడిన లోతైన పగులును ఆమె చూపించారు. ‘నా సితార్ శృతి తప్పిందేమోనని ముందు భావించాను. వాయించడానికి తీసుకున్నప్పుడే ఈ దారుణం తెలిసింది’.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘చాలా కాలం తర్వాత ఎయిర్ ఇండియాను ఎంచుకున్నాను. నా వాయిద్యానికే ఇలా ఎందుకు జరిగింది? ప్రత్యేక హార్డ్–కేసులు ఉన్నా, హ్యాండ్లింగ్ రుసుములు వసూలు చేసినా ఇంత దారుణమైన నిర్లక్ష్యమా?’.. అని ఆమె నిలదీశారు. పరిశీలిస్తున్నామన్న ఎయిర్ ఇండియా అనౌష్క తన విమాన వివరాలను, ఎక్కడ దిగారనేది చెప్పనప్పటికీ, ఎయిర్ ఇండియా ప్రతినిధి గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘మా అతిథి అనుభవించిన బాధకు చింతిస్తున్నాం. ఈ వాయిద్యం సాంస్కృతిక ప్రాధాన్యం మాకు తెలుసు’.. అని పేర్కొన్నారు. నష్టానికి గల కారణాలను నిర్ధారించలేకపోతున్నామని చెప్పిన సంస్థ, ఢిల్లీ విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీతో సహా సమగ్ర విచారణ ప్రారంభించినట్లు తెలిపింది. భారత్ పర్యటనకు ముందే.. జనవరి 30న హైదరాబాద్‌తో ప్రారంభం కానున్న తన భారత పర్యటనకు అనౌష్క శంకర్ సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం పలువురు కళాకారుల్ని కలచివేసింది. ఈ సంఘటన హృదయ విదారకమని ప్రముఖ కళాకారులు జాకిర్ ఖాన్, విశాల్ దడ్లాని పేర్కొన్నారు. గాయకుడు పాపోన్ స్పందిస్తూ, ‘ఈ రోజుల్లో శ్రద్ధ కరువైంది. అసలు శ్రద్ధ అనే భావమే కనుమరుగైందేమో! ఇది విచారకరం’.. అంటూ ఎయిర్ ఇండియా తీరుపై మండిపడ్డారు. గతంలోనూ ప్రయాణ సమస్యలు 44 ఏళ్ల శంకర్ గత ఏడాది కూడా ప్రయాణ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన యూరోపియన్ టూర్ చివరి షో కోసం బెర్లిన్‌లో ఉన్నప్పుడు, దుస్తులు, వాయిద్యానికి అవసరమైన ’మిజ్రాబ్స్’ (వేళ్లకు ధరించే ఫిక్సŠడ్ పికర్స్) ఉన్న లగేజీని పోగొట్టుకున్నారు. పదేపదే తప్పిదాలా? సంగీత కళాకారులకు ఇలాంటి చేదు అనుభవాలు కొత్తేమీ కాదు. 2010లో సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ వాయిద్యం ఎయిర్ ఇండియాలో దెబ్బతినగా, 2019లో పండిట్ శుభేంద్ర రావు సితార్ కూడా ఈ సంస్థ విమానంలోనే దెబ్బ తింది. తాజా ఘటనతో, విమానయాన సంస్థలు కళాకారుల విలువైన వాయిద్యాల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. -
పట్టుచీర కట్టుకోమ్మా...
‘చిట్టి గువ్వలాంటి చక్కనమ్మా... బొట్టు పెట్టి పట్టుచీర కట్టుకోమ్మా...’ అంటూ మొదలవుతుంది ‘మిస్టర్ బచ్చన్’లోని ‘సితార్’ సాంగ్. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పనోరమా స్టూడియోస్, టీ–సిరీస్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. బుధవారం ‘సితార్...’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. కశ్మీర్ వ్యాలీలో ఈ మెలోడీ డ్యూయెట్‌ను రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్లో చిత్రీకరించారు. చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరపరచిన ఈ పాటకు సాహితి సాహిత్యం అందించగా సాకేత్, సమీరా భరద్వాజ్ పాడారు. -
మెక్రాన్ సతీమణికి పోచంపల్లి ఇక్కత్ చీర బహుకరించిన మోదీ..
ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన రెండు రోజులపాటు కొనసాగింది. శుక్రవారం జరిగిన బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీని ఫ్రాన్స్ అత్యన్నత పురస్కారంతో ఆ దేశ అధ్యక్షుడు సన్మానించారు. అయితే.. పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలకు తోడు సంస్కృతిక అంశాలను కూడా జోడించారు. ఆ దేశ పెద్దలకు ప్రధాని మోదీ భారత సంస్కృతికి చెందిన విలక్షణమైన కానుకలను అందించారు. అధ్యక్షుడు మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సితార్‌ను బహుకరించారు. దక్షిణ భారతదేశంలో గంధపు చెక్కతో చేసే పూరాతన హస్తకళకు చెందిన కళారూపం. సరస్వతీ దేవీ, జాతీయ పక్షి నెమళ్లతో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి. మెక్రాన్ సతీమణి చేత.. తెలంగాణ చీర.. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్‌కు ప్రధాని మోదీ పోచంపల్లి ఇక్కత్ చీరను బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఇక్కత్ చీర తెలంగాణకు చెందిన పోచంపల్లిలో ఉద్భవించిన అరుదైన కళారూపం. ఆకర్షనీయమైన రంగులతో క్లిష్టమైన డిజైన్లకు ప్రసిద్ధి చెందిన కళాఖండం. చందనం పెట్టెపై కూడా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కబడి ఉన్నాయి. మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్.. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు 'మార్బుల్ ఇన్లే వర్క్'తో అలంకరించబడిన టేబుల్‌ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. రాజస్థాన్‌లోని మక్రానా నుంచి పాలరాతిని, దేశంలో విలువైన రాళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రాళ్లను కత్తిరించి అందంగా తయారు చేసే కళాఖండం. కాశ్మీరీ కార్పెట్.. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన కాశ్మీరీ కార్పెట్‌ను బహుకరించారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ కలిగిన కళారూపం ఇది. మృదుత్వం కలిగి వివిధ కోణాల్లో వేరు వేరు రంగుల్ని కలిగి ఉంటుంది. గంధపు ఏనుగు.. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహుకరించారు. ఏనుగు భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. ప్రకృతికి, కళలకు మధ్య సామరస్యాన్ని సూచించే అందమైన ప్రతిబింబం ఇది. ఇదీ చదవండి: ప్రధాని ఫ్రాన్స్ పర్యటన.. మోదీ భారీ ప్రకటనలు.. -
కరోనాతో సితార్ విద్వాంసుడు కన్నుమూత
న్యూఢిల్లీ: కరోనా ధాటికి మరో ప్రముఖుడు కన్నుమూశాడు. ప్రముఖ సితార్ విద్వాంసుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత దేవబ్రత చౌదరి (85) మృతిచెందారు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమారుడు ప్రతీక్ చౌదరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల కరోనా పాజిటివ్ తేలగా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న ఆయన ఆక్సిజన్ స్థాయి శుక్రవారం ఒక్కసారిగా పడిపోయింది. సంగీత ప్రపంచానికి పండిత్ దేవబ్రత చౌదరి అరవై ఏళ్ల పాటు విశేష సేవలందరించారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డులను ప్రకటించింది. ఆయన మృతికి కేంద్ర సాంస్కృతిక శాఖ సంతాపం ప్రకటించింది. చదవండి: కరోనా పేషెంట్‌కు ఆవు మూత్రం పోసిన నేత చదవండి: సంతలో లస్సీ.. 100 మంది ప్రాణం మీదకు వచ్చింది.. -
భాగ్యనగరం తల్లిలాంటింది!
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో ప్రఖ్యాత సితార్ విద్యాంసుల్లో పండిట్ జనార్దన్ మిట్టా ఒకరు. స్వయంకృషితో ఎదిగిన హిందూస్థానీ సంగీత సాధకుడాయన. ఆరు దశాబ్దాలుగా సినీ, శాస్త్రీయ సంగీత రంగాలకు సేవ చేసిన జనార్దన్.. కళా నిలయమైన హైదరాబాద్‌లోనే జన్మించారు. చిన్న వయసులోనే సితార్‌పై మక్కువ పెంచుకుని ఎవరి శిక్షణ లేకుండానే సంగీతంపై పట్టు సాధించారు. ఆనాటి దక్కన్ రేడియోలో బాల కళాకారుడిగా కచేరీలు కూడా ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ వద్ద మెలకువలు నేర్చుకుని దక్షిణాదిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంగమం ఆధ్వర్యంలో అరవై వసంతాల సంగీత వేడుకల సందర్భంగా లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డు అందుకొనేందుకు ఇటీవల రవీంద్రభారతికివచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. విదేశాల్లో సంగీత ప్రయాణం.. పండిట్ జనార్దన్ శాస్త్రీయ రంగంలో గాయకి, తంత్రకారి శైలులు రెండింటిపై పట్టు సాధించిన అరుదైన కళాకారుడిగా పేరు పొందారు. దేశ విదేశాల్లో పర్యటించి హిందూస్తానీ కచేరీలు చేశారు. వి.రాఘవన్, టీఎన్ కృష్ణన్, ఎం చంద్రశేఖరన్ , టీవీ గోపాలకృష్ణన్, కన్యాకుమారి, ఉస్తాద్ షేక్ దావూద్, జాకీర్ హుస్సేన్ వంటి సంగీత దిగ్గజాలతో జుగల్బందీలనూ, ఫ్యూషన్ సంగీత కచేరీలు చేశారు. అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, జర్మనీ, శ్రీలంక, వెస్టిండీస్, సింగపూర్ వంటి దేశాల్లో తన సితార్ కచేరీలతో ప్రేక్షకులను మైమరపించారు. 1971లో న్యూయర్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేశారు. పండిట్ రవిశంకర్ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన వాద్య కళాకారుడు మన జనార్దన్ మాత్రమే. 1976లో తిరువాయూరులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీ చేసిన తొలి హిందూస్థానీ వాద్య కళాకారుడిగా ప్రత్యేకతను పొందారు. కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠాల ఆస్థాన విద్వాన్గా సేవలందించారు. సాదర స్వాగతం పలికిన సినీ ప్రపంచం.. జనార్దన్ మిట్టా ప్రతిభను గుర్తించిన సినీ ప్రపంచం సాదరంగా ఆహ్వానించింది. 1958లో భాగ్యదేవత చిత్రంలోని పాటలకు సితార్‌ను వాయించడంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్. రాజేశ్వరావు మొదలుకొని ఏఆర్ రెహమాన్ వరకు దక్షిణాది అన్ని భాషల సంగీత దర్శకుల దగ్గర ప్రధాన సితార్ వాద్యకారుడిగా పనిచేశారు. దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ సినీ గీతాలలో కూడా తన సితార్ మెరుపులు మెరింపించారు. తన ఆరు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు ముప్పైవేల పాటలకు సితార్ వాద్య సహకారాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఎన్నో వందల చిత్రాల రీరికార్డింగ్ల్లో సన్నివేశాలకు తన సితార్ నాదంతో జీవం పోశారు. తెలుగులో రంగుల కల, అగ్ని సంస్కారం, మలయాళంలో ఎసైప్పన్, సంస్కార్ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. బ్లిస్, శ్రీశైలం, యాభై వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ వంటి లఘు చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. కథలు సమాజాన్ని ప్రభావితం చేయాలి కమల్‌హాసన్ నటించిన మాటలు లేని పుష్పక విమానం చిత్రంలో తెర వెనుక జనార్దన్ సితార్ ఎన్నో భావాలను పండించింది. ఇక చరిత్రలో నిలిచిపోయే ఘంటసాల భగవద్గీతలో కూడా జనార్దన్ తన సితార్ వాదనతో అమరత్వాన్ని అద్దారు. ఎన్నెన్నో పురస్కారాలు ... మద్రాస్ సినీ మ్యూజిషియన్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా, ట్రస్ట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని, సంగీత కళాభారతి, సంగీత శిరోమణి, సితార్ చక్రవర్తి, సితార్ సమ్రాట్ వంటి ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తాను నెలకొల్పిన విశ్వకళా సంగమ సంస్థ ద్వారా కళారూపాలనూ, కళాకారులనూ ప్రోత్సహిస్తున్నారు. ‘ఎన్నెన్నో పురస్కారాలు అందుకొని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అరవై వసంతాల సంగీత జీవిత వేడుకల సందర్భంగా పొందిన టైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు (స్వర్ణ కంకణం) జీవితంలో మరువలేను. భాగ్యనగరంతల్లిలాంటింది. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినా హైదరాబాద్‌కు వస్తే తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు ఉంటుంది. ఈ నేల, ఈ గాలి, ఈ వాతావరణం ఎప్పుడూ మరువలేను. హైదరాబాద్‌కు ఎంత చేసినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోలేనిది’ అన్నారు ఆయన. -
పద్మశ్రీని తిరస్కరించిన ఉస్తాద్
షికాగో: ప్రముఖ సితార్, సుర్బహార్ విద్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ (82) ఇటీవలే తనకు కేటాయించిన ‘పద్మశ్రీ’ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న పేరు ప్రఖ్యాతులకు ఈ అవార్డు తక్కువని.. అయినా చాలా ఆలస్యంగా తనను గుర్తించారన్నారు. సెయింట్ లూయిస్‌లో ఉంటున్న ఉస్తాద్‌ను షికాగోలోని భారత కాన్సులేట్ అధికారులు సంప్రదించగా.. ‘నా జూనియర్లు ఎప్పుడో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దశాబ్దాలు ఆలస్యంగా నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా’ అని తెలిపారు. -
యువకళలు
తల్లిదండ్రుల ఇష్టాన్నే తమ ఇష్టంగా ముందుకు సాగుతున్నవారు కొందరైతే.. తల్లిదండ్రుల కళను వారసత్వంగా కొనసాగిస్తున్నవారు మరికొందరు. కొంగుచాటు బిడ్డలుగా కాక తల్లిదండ్రులకే కేరాఫ్‌గా నిలుస్తున్నారీ యువతీయువకులు. పాశ్చాత్య ఒరవడిలో పడి కొట్టుకుపోకుండా సంస్కృతీసంప్రదాయాలను గౌరవిస్తూ... వాటికి జీవం పోస్తున్నారు. అసోంలో ఇటీవల జరిగిన యువజనోత్సవాల్లో విజేతలుగా నిలిచి నగర కీర్తి పతకాన్ని ఎగురవేశారు. కళలపై ఆసక్తికి సాధన తోడైతే గెలుపు మనదేనంటున్నారు నగర యువత. చదువుతూ భవిష్యత్‌పై కలలు కనే వయసులో కళల్లో రాణిస్తున్నారు. ఇటీవల గువాహటిలో జరిగిన 19వ జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొని, వేర్వేరు విభాగాల్లో ఇతర రాష్ట్రాలనుంచి గట్టి పోటీని ఎదుర్కొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే విజయం తమ సొంతమైందని చెబుతున్నారు. - తన్నీరు సింహాద్రి, మాదాపూర్ అంతర్జాతీయంగా ఎదగాలి..... నాన్న ఉస్తాద్ బషీర్ అహ్మద్‌ఖాన్ సితార్ వాయించేవాడు. నాన్న గారిని చుస్తూ పెరిగాను. ఆయనకు వస్తున్న గుర్తింపును చూసి నాకు తెలియకుండానే సితార్వైపు ఆకర్షితుడినయ్యాను. అలా ఎనిమిదేళ్లనుంచి సాధన మొదలు పెట్టా. సితార్లో జాతీయస్థాయిలో రెండవ బహుమతి రావడంతో నాపై బాధ్యత పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. తెలుగు రాష్ట్రాల నుంచి సితార్లో జాతీయ ఉపకార వేతనం పొందుతున్న వారిలో మొదటి వాడిని. అన్వర్ ఉలూమ్ కళాశాలలో బీకాం చదువుతున్నాను. - ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, ద్వితీయ బహుమతి, సితార్ సంగీతంలో పీహెచ్డీ చేస్తా... అమ్మమ్మ సుశీల గోపాలం ఆలిండియా రేడియోలో వీణ కళాకారిణి. ఆమె ప్రభావంతో పన్నెండేళ్ల వయసులోనే వీణ సాధన మొదలుపెట్టాను. అమ్మ రామలక్ష్మి నా మొదటి గురువు. నాన్న విశ్వేశ్వరరావు ఎంకరేజ్మెంట్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు బర్కత్‌పుర డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతూ వి.శ్రీనివాస్‌గారి దగ్గర వీణ నేర్చుకుంటున్నా. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి రావడం ఆనందాన్నిస్తోంది. - సీహెచ్ కార్తీక్, ప్రథమ బహుమతి, వీణ డాక్టరేట్ నా కల... ముఖంలోనే భావాలను పలికించే నృత్యరూపకం కూచిపూడి. ఐదేళ్ల ప్రాయం నుండే నేర్చుకుంటున్నా. అమ్మ పూర్ణాదేవి కూడా నర్తకి. తానే నా మొదటి గురువు. ప్రస్తుతం చింతా రవి బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఆకాశవాణిలో బీగ్రేడ్ కళాకారిణిని కూడా. జాతీయస్థాయిలో గుర్తింపు రావడం సంతోషాన్నిస్తోంది. మరింత సాధన చేసి మెరుగైన ప్రదర్శనలు ఇస్తాను. హెచ్ఆర్డీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నృత్యంలో డాక్టరేట్ సాధించాలన్నది నా కల. - లాస్యప్రణతి, ద్వితీయ బహుమతి, కూచిపూడి కుటుంబ ప్రోత్సాహం.. నాల్గో తరగతినుంచే భరతనాట్య అభ్యాసం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. జాతీయ ఉత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటి సారి. అయినా తృతీయ బహుమతి రావడం సంతోషంగా ఉంది. అమ్మ జ్యోతి, నాన్న రాధాకృష్ణ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. మనసంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేదే లక్ష్యం. - వి.నవ్యశ్రావణి, భరతనాట్యం,తృతీయ బహుమతి. ఇష్టమైతే కష్టముండదు... అమ్మ శాంతికుమారి, నాన్న జానకీరావులకు ఒడిస్సీ నృత్యమంటే చాలా ఇష్టం. వారి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకున్నా. ఈ నృత్యంలో శరీర భాగాలన్నీ కదిలించాలి. అతి కష్టమైన నృత్యం. ఇష్టమైనదేదీ కష్టమనిపించదు. అందుకే గృహిణిగా ఉంటూనే కళను కొనసాగించగలిగాను. మూడో బహుమతి గెలుచుకోగలిగాను. నా భర్త వి.వేణుమాధవ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. భవిష్యత్ తరాలకు కళలపై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తా. - వి. రమణకుమారి, ఒడిస్సీ నృత్యకారిణి, తృతీయ బహుమతి


