యువకళలు | The young crafts | Sakshi
Sakshi News home page

యువకళలు

Jan 22 2015 11:10 PM | Updated on Sep 2 2017 8:05 PM

యువకళలు

యువకళలు

తల్లిదండ్రుల ఇష్టాన్నే తమ ఇష్టంగా ముందుకు సాగుతున్నవారు కొందరైతే.. తల్లిదండ్రుల కళను వారసత్వంగా కొనసాగిస్తున్నవారు మరికొందరు.

తల్లిదండ్రుల ఇష్టాన్నే తమ ఇష్టంగా ముందుకు సాగుతున్నవారు కొందరైతే.. తల్లిదండ్రుల కళను వారసత్వంగా కొనసాగిస్తున్నవారు మరికొందరు. కొంగుచాటు బిడ్డలుగా కాక తల్లిదండ్రులకే కేరాఫ్‌గా నిలుస్తున్నారీ యువతీయువకులు. పాశ్చాత్య ఒరవడిలో పడి కొట్టుకుపోకుండా సంస్కృతీసంప్రదాయాలను గౌరవిస్తూ... వాటికి జీవం పోస్తున్నారు. అసోంలో ఇటీవల జరిగిన యువజనోత్సవాల్లో విజేతలుగా నిలిచి నగర కీర్తి పతకాన్ని ఎగురవేశారు.

కళలపై ఆసక్తికి సాధన తోడైతే గెలుపు మనదేనంటున్నారు నగర యువత. చదువుతూ భవిష్యత్‌పై కలలు కనే వయసులో కళల్లో రాణిస్తున్నారు. ఇటీవల గువాహటిలో జరిగిన 19వ జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొని, వేర్వేరు విభాగాల్లో ఇతర రాష్ట్రాలనుంచి గట్టి పోటీని ఎదుర్కొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతోనే విజయం తమ సొంతమైందని చెబుతున్నారు.

 - తన్నీరు సింహాద్రి, మాదాపూర్
 
అంతర్జాతీయంగా ఎదగాలి.....
నాన్న ఉస్తాద్ బషీర్ అహ్మద్‌ఖాన్ సితార్ వాయించేవాడు. నాన్న గారిని చుస్తూ పెరిగాను. ఆయనకు వస్తున్న గుర్తింపును చూసి నాకు తెలియకుండానే సితార్‌వైపు ఆకర్షితుడినయ్యాను. అలా ఎనిమిదేళ్లనుంచి సాధన మొదలు పెట్టా. సితార్‌లో జాతీయస్థాయిలో రెండవ బహుమతి రావడంతో నాపై బాధ్యత పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా కోరిక. తెలుగు రాష్ట్రాల నుంచి సితార్‌లో జాతీయ ఉపకార వేతనం పొందుతున్న వారిలో మొదటి వాడిని. అన్వర్ ఉలూమ్ కళాశాలలో బీకాం చదువుతున్నాను.
- ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, ద్వితీయ బహుమతి, సితార్
 
సంగీతంలో పీహెచ్‌డీ చేస్తా...
అమ్మమ్మ సుశీల గోపాలం ఆలిండియా రేడియోలో వీణ కళాకారిణి. ఆమె ప్రభావంతో పన్నెండేళ్ల వయసులోనే వీణ సాధన మొదలుపెట్టాను. అమ్మ రామలక్ష్మి నా మొదటి గురువు. నాన్న విశ్వేశ్వరరావు ఎంకరేజ్‌మెంట్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు బర్కత్‌పుర డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఆఖరి సంవత్సరం చదువుతూ వి.శ్రీనివాస్‌గారి దగ్గర వీణ నేర్చుకుంటున్నా. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి రావడం ఆనందాన్నిస్తోంది.
- సీహెచ్ కార్తీక్, ప్రథమ బహుమతి, వీణ
 
డాక్టరేట్ నా కల...

ముఖంలోనే భావాలను పలికించే నృత్యరూపకం కూచిపూడి. ఐదేళ్ల ప్రాయం నుండే నేర్చుకుంటున్నా. అమ్మ పూర్ణాదేవి కూడా నర్తకి. తానే నా మొదటి గురువు. ప్రస్తుతం చింతా రవి బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఆకాశవాణిలో బీగ్రేడ్ కళాకారిణిని కూడా. జాతీయస్థాయిలో గుర్తింపు రావడం సంతోషాన్నిస్తోంది. మరింత సాధన చేసి మెరుగైన ప్రదర్శనలు ఇస్తాను. హెచ్‌ఆర్‌డీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నృత్యంలో డాక్టరేట్ సాధించాలన్నది నా కల.  
- లాస్యప్రణతి, ద్వితీయ బహుమతి, కూచిపూడి
 
కుటుంబ ప్రోత్సాహం..
నాల్గో తరగతినుంచే భరతనాట్య అభ్యాసం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. జాతీయ ఉత్సవాల్లో పాల్గొనడం ఇదే మొదటి సారి. అయినా తృతీయ బహుమతి రావడం సంతోషంగా ఉంది. అమ్మ జ్యోతి, నాన్న రాధాకృష్ణ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. మనసంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేయాలనేదే లక్ష్యం.
- వి.నవ్యశ్రావణి, భరతనాట్యం,తృతీయ బహుమతి.
 
ష్టమైతే కష్టముండదు...
అమ్మ శాంతికుమారి, నాన్న జానకీరావులకు ఒడిస్సీ నృత్యమంటే చాలా ఇష్టం. వారి ప్రోత్సాహంతో ఒడిస్సీ నేర్చుకున్నా. ఈ నృత్యంలో శరీర భాగాలన్నీ కదిలించాలి. అతి కష్టమైన నృత్యం. ఇష్టమైనదేదీ కష్టమనిపించదు. అందుకే గృహిణిగా ఉంటూనే కళను కొనసాగించగలిగాను. మూడో బహుమతి గెలుచుకోగలిగాను. నా భర్త వి.వేణుమాధవ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. భవిష్యత్ తరాలకు కళలపై ఆసక్తిని పెంచేందుకు ప్రయత్నిస్తా.
- వి. రమణకుమారి, ఒడిస్సీ నృత్యకారిణి, తృతీయ బహుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement