ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ కోసం తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ షాహీన్స్ జట్టు కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటికే పేలవ ఫామ్ కారణంగా పాక్ సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు.
ఇర్ఫాన్ చివరగా ఈ ఏడాది మార్చిలో పాక్ తరపున ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ ఆల్‌రౌండర్ తన సత్తాను నిరూపించుకునేందుకు పీసీబీ మరొక అవకాశం ఇచ్చింది. ఇక ఈ జట్టులో అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ నయీమ్, ఉబైద్ షా యువ ఆటగాళ్లకు పీసీబీ సెలక్టర్లు చోటు ఇచ్చారు.
పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా సోదరుడు అయిన ఉబైద్ షా దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పీఎస్‌ఎల్-2025లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు ఆసియా కప్‌నకు ఎంపిక చేశారు . అదేవిధంగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని సుఫియాన్ మోఖిమ్ లీడ్ చేయనున్నాడు. సుఫియాన్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టులో కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ జట్టు ఇండియా-ఎ, ఒమన్, యూఎఈలతో పాటు గ్రూప్-బిలో ఉంది. ఈ టోర్నీ ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఒమన్-పాక్ జట్లు తలపడనున్నాయి. అనంతరం నవంబర్ 16న చిరకాల ప్రత్యర్ధులు పాక్-భారత్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కెప్టెన్‌గా జితేష్ శర్మ వ్యవహరించనున్నాడు.
పాక్ జట్టు
ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ (కెప్టెన్), అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, మాజ్ సదాకత్, మహ్మద్ ఫైక్, ముహమ్మద్ ఘాజీ ఘోరి, మహ్మద్ నయీమ్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ షాజాద్, ముబాసిర్ ఖాన్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్, సుఫియాన్ మొకిమ్, ఉబైద్ షా
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్) (వికెట్ కీపర్), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, విజయ్‌కుమార్ వైశాక్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ


