వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే విధ్వంసకర బ్యాటింగ్‌తో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొన్న యువ సంచలనం అతడు. ఐపీఎల్ చరిత్రలోనే అమ్ముడైన అతి పిన్న వయష్కుడైన ఆటగాడిగా నుంచి.. అండర్-19 స్థాయిలో మెరుపు సెంచరీలు బాదడం వరకు అతడి ప్రయాణం నిజంగా ఒక అద్భుతం.
అయితే అంతర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో నిలిచిన వైభవ్.. కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముంది. వైభవ్‌కు అద్భుతమైన టాలెంట్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ జూనియర్ క్రికెట్‌కు సీనియర్ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది.
హిట్టింగ్ ఒక్కటే కాదు..
క్రికెట్ ఒక చదరంగం వంటిది. ఎక్కడ ఎత్తుకు పై ఎత్తు వేయాలో.. ఎక్కడ తగ్గాలో స్పష్టంగా తెలియాలి. సీనియర్ స్ధాయిలో రాణించాలంటే కేవలం హిట్టింగ్ చేసే సత్తా ఉంటే సరిపోదు. వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచినప్పటికి.. తమ శైలికి విరుద్దంగా ఆడి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియాకప్‌నే ఉదాహరణగా తీసుకుందాం.
యూఏఈ, మలేషియా వంటి పసికూనలపై విధ్వసంకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ వైభవ్.. కీలకమైన ఫైనల్లో పాకిస్తాన్‌పై మాత్రం విఫలమయ్యాడు. కేవలం పది బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో జట్టుకు కావాల్సింది ఇది కాదు. నిలకడగా ఆడి తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవాలి. అప్పుడే జట్టు విజయాల్లో సదరు ఆటగాడు భాగం అవుతాడు.
వైభవ్ త్వరగా ఔట్ కావడం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదే వైభవ్ ఒక పది పదేహేను ఓవర్ల పాటు కాస్త ఆచితూచి ఆడి క్రీజులో నిలబడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. పరిస్థితికి తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. ఎప్పుడు డిఫెన్సివ్‌గా ఆడాలి.. ఎప్పుడు ఎటాక్ చేయాలో తెలుసుకోవాలి. ఈ విషయంలో అతడు ఇంకా పరిణితి చెందాలి. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం,షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో సూర్యవంశీ ఇంకా మెరుగుపడాలి.
టాలెంట్ ఉంటే సరిపోదు..
క్రికెట్ వంటి జేంటిల్ మ్యాన్ గేమ్‌లో నిలదొక్కకోవాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు.. మన ప్రవర్తన కూడా ముఖ్యం. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ బౌలర్ అలీ రాజా- వైభవ్ సూర్యవంశీ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైభవ్‌ను ఔట్ చేసిన అనంతరం అలీ రాజా స్లెడ్జ్ చేశాడు. అయితే తన సహనాన్ని కోల్పోయి వైభవ్.. తన కాలి షూ వైపు చూపిస్తూ దుర్భాషలాడాడు. ఈ విషయంపై బీసీసీఐ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మైదానంలో దూకుడు అవసరమే కానీ.. అది హుందాతనాన్ని దాటకూడదు.
హద్దు దాటకూడదు..
కాగా క్రికెటర్‌గా చిన్నవయసులో వచ్చిన కీర్తి ప్రతిష్ఠలను, డబ్బును హ్యాండిల్ చేయడం అంత సులువు కాదు. వైభవ్ అతి పిన్న వయస్సులోనే రాజస్తాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు. దీంతో ఈ బిహార్ ఆటగాడు ఓవర్‌నైట్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి ఒక హోదా పొందిన వైభవ్ తన కెరీర్ పక్క త్రోవపట్టకుండా జాగ్రత్త పడాలి.
ఎందుకంటే ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. పృథ్వీ షాను తన కెరీర్ ఆరంభంలో భారత క్రికెట్‌కు మరో సచిన్ టెండూల్కర్ దొరికాడని అంతా భావించారు. అందుకు తగ్గట్టే తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ, ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అతడి పేరు మారుమ్రోగింది. కానీ కొన్నాళ్లకే తన లభించిన డబ్బును, కీర్తి ప్రతిష్ఠలను హ్యాండిల్ చేయలేక ఒక సాధారణ క్రికెటర్‌గా మిగిలిపోయాడు.
జైశ్వాల్ ఒక రోల్ మోడల్..
వైభవ్ సూర్య వంశీ.. తన రాజస్తాన్ రాయల్స్ టీమ్ యశస్వి జైశ్వాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. జైశ్వాల్ అతి తక్కువ కాలంలోనే ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగినా.. తన వినయాన్ని, ఆటపై ఫోకస్‌ను ఎప్పుడూ కోల్పోలేదు. ఐపీఎల్ అనేది ఒక వేదిక మాత్రమే.. అదే చివరి లక్ష్యం కాదని వైభవ్ గుర్తించాలి.
ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన జైశ్వాల్ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ అతడు ఎక్కడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు. చివరి వన్డేలో సెంచరీతో సత్తాచాటి భారత్‌కు సిరీస్‌ను అందించాడు. ఇది కదా ఒక ఛాంపియన్ క్రికెటర్ లక్షణం.
ఓవర్ కాన్ఫడెన్స్ వద్దు..
వైభవ్ ఆటలో అతి విశ్వాసం కన్పిస్తోంది. అయితే సిక్స్.. లేదంటే అవుట్ అనే ధోరణిలో అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నంలో అతడు తన వికెట్‌ను కోల్పోతున్నాడు. కానీ క్రికెట్ వంటి మాస్టర్ మైండ్ గేమ్‌లో అది ఏ మాత్రం పనికిరాదు.
వికెట్ విలువ తెలిసి ఆడినవాడే గొప్ప బ్యాటర్ అవుతాడు. కఠినమైన బంతులను ఆచితూడి ఆడుతూ.. సులువైన బంతులను ఫనిష్ చేసేవాడే వరల్డ్ క్లాస్ బ్యాటర్ కాగలడు.


