ఇస్లామాబాద్: భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మెరుపు దాడుల సమయంలో పాకిస్తాన్‌కు దైవిక సహాయం లభించిందని ఆ దేశ రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే నెలలో పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన దాడుల సమయంలో తమ సైన్యానికి ఏదో అదృశ్య శక్తి తోడు అందించిందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన జాతీయ ఉలేమా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో ‘జిహాద్’ అంశంపై మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఇస్లామిక్ దేశంలో ప్రభుత్వం లేదా అధికారం ఉన్న పాలకుల అనుమతి లేకుండా ఎవరూ సొంతంగా జిహాద్‌కు ఆదేశాలు ఇవ్వలేరని స్పష్టం చేశారు. ఎవరైనా తమకు తాముగా ఫత్వాలు జారీ చేయడం చెల్లదని అన్నారు. మక్కా, మదీనా వంటి పవిత్ర స్థలాల రక్షకులుగా ఉండే గౌరవం దేవుడు తమకే ఇచ్చారని ఈ సందర్భంగా మునీర్ పేర్కొన్నారు.
పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు అసిమ్ మునీర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్‌లోకి చొరబడి దాడులకు తెగబడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)గ్రూపుల్లో 70 శాతం మంది ఆఫ్ఘన్ జాతీయులే ఉన్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ప్రజల రక్తాన్ని కోరుతున్న వారికి మద్దతు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. భారతదేశంతో జరిగిన ఆ నాలుగు రోజుల సైనిక ఘర్షణ ముగిసిన తీరును ఆయన విశ్లేషించారు. మే 10న కుదిరిన ఒప్పందంతో సైనిక చర్యలు నిలిచిపోయినప్పటికీ, నాడు పాకిస్తాన్‌కు ఎదురైన గడ్డు పరిస్థితుల నుండి దైవ కృపే రక్షించిందని అన్నారు.
ఇది కూడా చదవండి: మరో చరిత్ర: జర్మనీకి ఇజ్రాయెల్ ‘ఆరో’ రక్షణ


