కమాండర్‌ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు | Naxalites surrendered their weapons and returned to the mainstream | Sakshi
Sakshi News home page

కమాండర్‌ మజ్జీతో సహా భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Dec 8 2025 9:24 AM | Updated on Dec 8 2025 9:51 AM

Naxalites surrendered their weapons and returned to the mainstream

రాజ్‌నంద్‌గావ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్‌ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో  లొంగిపోయాడు. ఈ లొంగుబాటుతో ఎంఎంసీ జోన్ ఇప్పుడు దాదాపు నక్సలైట్ రహితంగా  మారిందని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో కమాండర్‌ రామ్‌ధేర్ మజ్జీ, చందు ఉసెండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం,లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత  తదితరులు ఉన్నారు.

మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ విజయం
ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ (కెసిజి) జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ప్రచారం మరో పెద్ద విజయాన్ని  అందుకుంది. బకర్‌కట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంహి గ్రామంలో 12 మంది సిపిఐ (మావోయిస్ట్) కార్యకర్తలు మొత్తం 10 ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అత్యంత ప్రముఖుడు, కేంద్ర కమిటీ సభ్యుడు (సిసిఎం), ఎంఎంసి (మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్ ఇన్‌చార్జ్ రామ్‌ధేర్ మజ్జి ఉన్నారు. ఆయనపై రూ. 45 లక్షల భారీ రివార్డు ఉంది. రామ్‌ధేర్‌కు ఇటీవలే ఎంఎంసి జోన్ బాధ్యత అప్పగించారు. ఈ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితమే మావోయిస్టు ప్రతినిధి అనంత్ కూడా తన 10 మంది సహచరులతో పాటు లొంగిపోయారు.

తాజాగా పోలీసులకు లొంగిపోయిన వారిలో రామ్‌ధేర్ మజ్జీతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారిలో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు (డివిసిఎంలు)చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్  ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల బహుమతి ఉంది. అలాగే ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు.. రాంసింగ్ దాదా,  సుకేష్ పొట్టం  ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల బహుమతి ఉంది. మిగిలిన ఐదుగురు కార్యకర్తలు.. లక్ష్మి, షీలా, సాగర్, కవిత యోగితా.. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 2 లక్షల బహుమతి ఉంది. వీరు పోలీసులకు అందించిన మొత్తం 10 ఆయుధాలలో ముఖ్యంగా AK-47లు, INSAS రైఫిల్స్, SLRలు, 303, 30 క్యాలిబర్ కార్బైన్‌లు తరహా అధునాతన ఆయుధాలు ఉన్నాయి.

ఇటీవలే ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్, తాజాగా ఇన్‌ఛార్జ్ రామ్‌ధేర్ ఇద్దరి లొంగుబాటు మావోయిస్టు వ్యవస్థలో నాయకత్వ సంక్షోభాన్ని సృష్టించిందని విశ్లేషకులు అంటున్నారు. దీని ప్రభావం రాబోయే నెలల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. రామ్‌ధేర్.. బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసించేవాడు. గత ఏడాది బస్తర్ నుండి కేంద్ర కమిటీ సభ్యునిగా నియమితుడైన రెండవ గిరిజన మావోయిస్టు ఈయనే. హిడ్మాతో పాటు ఈయన కూడా అంతే గౌరవం దక్కింది. హిడ్మా ఇటీవలే హతం కావడం, ఇప్పుడు రామ్‌ధేర్ లొంగిపోవడంతో బస్తర్‌లోని మావోయిస్టు వ్యవస్థ దాదాపు విచ్ఛిన్నం అయిందని విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement