హిడ్మా తల్లితో లొంగుబాటుపై మాట్లాడుతున్న ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి (ఫైల్)
హిడ్మా కదలికలపై నిఘా పెట్టిన గ్రేçహౌండ్స్ దళాలు
మరోవైపు తల్లి ద్వారా లొంగుబాటు ప్రతిపాదనలు
నాలుగు వారాల కిందటే దండకారణ్యం వదలిన హిడ్మా?
లొంగుబాటు చర్చలు జరుపుతూనే దేశం దాటే యత్నం!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: హిడ్మా, మరో మావోయిస్టు నేత దేవ్‌జీ లక్ష్యంగా గత నెల రోజులుగా భద్రతా దళాలు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లోనే తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల దగ్గర మావోయిస్టులు సమావేశమయ్యారు. ఈ సమయంలో పెరిగిన నిర్బంధం కారణంగా అజ్ఞాత జీవితం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన హిడ్మా టీమ్‌లోని కొందరు కీలక నేతలు లొంగుబాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమకు ఉన్న కాంటాక్ట్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
కొందరు కీలక సభ్యులు గ్రేహౌండ్స్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. వీరి ద్వారానే హిడ్మాను కూడా లొంగిపొమ్మంటూ పోలీసులు, ప్రభుత్వ వర్గాలు రాయబారం పంపినట్టు సమాచారం. ఈ క్రమంలో హిడ్మా దండకారణ్యం విడిచిపెట్టినట్టు సందేహం కలిగిన వెంటనే ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ పువర్తికి వెళ్లి హిడ్మా తల్లిని కలిశారు. లొంగిపోవాలంటూ ఆమె ద్వారా హిడ్మాకు సందేశం పంపారు. ‘ఎక్కడున్నావ్ బిడ్డా సజీవంగా ఇంటికి రా.. ఇక్కడే కష్టపడి బతుకుదాం.. కలో గంజో తాగుతూ జీవిద్దాం.. నువ్వు ఎక్కడున్నావో ఇంటికి వచ్చేయ్.. ఎక్కడున్నావో చెప్పు నేనైనా వస్తా... రెండూ లేదంటే నేనే నిన్ను వెదుక్కుంటూ అడవి బాట పడతా..’అంటూ ఆమె ద్వారా పంపిన సందేశం హిడ్మాకు చేరిందో, లేదో కానీ వారంలోగానే ఆయన ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం.
దేశం దాటేందుకు ప్రయత్నం!
లొంగుబాటు ప్రతిపాదనపై హిడ్మా ఆచితూచి వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రతిపాదనలను ఏకపక్షంగా తిరస్కరించకుండా.. అలాగని వెంటనే ఒప్పుకోకుండా జనవరి వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా దండకారణ్యం సరిహద్దుల్లో పోలీసు వర్గాలతో వైరాన్ని తగ్గించుకునే ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చల ప్రక్రియను కొనసాగిస్తూనే సముద్ర మార్గం గుండా దేశం దాటి సేఫ్ జోన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు హిడ్మా అనుచరవర్గం కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత పోలీస్ వర్గాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ముందు వెళ్లిన దళాలు సురక్షితంగా వెళ్లేలా చేసి..
రెండు వారాల కిందట కర్రెగుట్టల పరిసరాలను విడిచిన హిడ్మా బృందం చిన్న జట్లుగా విడిపోయి తెలంగాణలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. ఇక్కడ నిఘా ఎక్కువగా ఉండడం, ఆదివాసీ గ్రామాల్లో ఉండే జనాలకు జియో ట్యాగింగ్ చేయడంతో స్థానికులను కలవడం కష్టంగా మారింది. దీంతో ఒడిశా మీదుగా ఏపీలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు మావోల కదలికలపై నిఘా వేసిన బలగాలు అనువైన సమయం కోసం ఓపిగ్గా వేచి చూశాయి. ప్లాన్ ప్రకారం ముందుగా వెళ్లిన బ్యాచ్‌లకు సేఫ్ ప్యాసేజ్ ఇచ్చాయి. దీంతో నమ్మకం కుదిరిన హిడ్మా తన బృందంతో ఏపీలోకి వచ్చారు. ఆ తర్వాత పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టగా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.
ఆజాద్ ఎక్కడ?
అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డివిజన్ కార్యదర్శిగా ఉన్న కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్‌తో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం గడిచిన నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ సమయంలోనే ఆజాద్ పర్యవేక్షణలో ఉన్న అల్లూరి జిల్లాలోకి హిడ్మా తన బృందంతో చేరుకోవడమనేది కాకతాళీయంగా జరిగిందా లేక పోలీసులు పన్నిన వ్యూహంలో భాగమా అనే చర్చ జరుగుతోంది.


