సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం వాహనదారులు ఇకపై రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరంలేదు. వాహనం కొన్నచోటే సంబంధిత డీలర్ వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. వచ్చే 15 రోజుల్లో కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రానుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC) నేరుగా పోస్ట్ ద్వారా కొనుగోలుదారు ఇంటికి వస్తుంది. ఈ కొత్త ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేషన్ పనులు జరుగుతున్నాయి. అవి కొలిక్కి రాగానే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇంతకాలం కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే షోరూమ్‌లలో జరుగుతోంది. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రవాణాశాఖ కార్యాలయాల్లోనే కొనసాగుతోంది. దీన్ని మార్చి షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాహనదారులకు ఈ ప్రక్రియ సులభంగా జరిగేలా చూడటంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో దళారులు అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న తీరును కూడా నిరోధించాలని దీని ద్వారా నిర్ణయించింది.
చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వ వాహన్ సారథి పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేరకపోవడం వల్ల కూడా ఇది ఆలస్యమవుతూ వచి్చంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ విధానాన్ని అమలులోకి తేవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా కొనుగోలు చేసే పూర్తి నిర్మిత రవాణాయేతర ద్విచక్ర, కార్లకు మాత్రమే కొత్త విధానం వర్తించనుంది. వాణిజ్య (ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు వర్తించదు.


